
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం బీసీ చైతన్య సదస్సు నిర్వహించనున్నట్లు వివిధ బీసీ సంఘాల నాయకులు తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ఉద్యమిస్తున్నామని పేర్కొన్నారు.
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మంచిర్యాల చార్వాక ట్రస్ట్ హాల్లో ఉదయం 10 గంటలకు సదస్సు జరగనుందని, ముఖ్య వక్తగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఫోరం చైర్మన్ చిరంజీవులు హాజరవుతారని చెప్పారు. బీసీలు హాజరై, విజయవంతం చేయాలని కోరారు. బీసీ రాజ్యసమితి జిల్లా కార్యదర్శి వేముల అశోక్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు జైపాల్ సింగ్, ప్రభాకర్ ఉన్నారు.