పనిచేయని ‘రైతు సమన్వయ  సమితి’

పనిచేయని ‘రైతు సమన్వయ  సమితి’

రైతు పేరుతో సర్కారు గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో చేసి చూపింది నామమాత్రం.  రైతుల బాధలు తీర్చేందుకు ప్ర్యతేకంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి ఉనికి ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యింది.  2018 మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ సమితి కమిటీలు వేశారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కూడా  475 గ్రామాల రైతు సమన్వయ సమితులు, 23 మండల రైతు సమన్వయ సమితులు, ఒక జిల్లా సమన్వయ సమితి చైర్మన్‌గా ఎన్నుకున్నారు. కానీ ఇప్పటి వరకు సమన్వయ సమితులు రైతులకు అవగాహన కల్పించిన దాఖలాలు ఏమాత్రం లేకపోవడం గమనార్హం.

అధికారపార్టీ నేతలకు అవకాశం కల్పించే ఉద్దేశ్యంతోనే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారనేందుకు ఇంతకన్న నిదర్శనం మరోకటి లేదనే చెప్పవచ్చు.  ఈ సమన్వయ సమితులు రైతులకు ప్రయోజనం చేకూర్చే ఒక్క కార్యక్రమం చేయలేదని  రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.  ప్రారంభంలో  మండలానికో రైతు సమన్వయ సమితి  భవనం ఏర్పాటు చేసి రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క రైతు సమన్వయ సమితి భవనాన్ని నిర్మించలేదు.  కాలం గడుస్తున్న రైతుల కోసం పనిచేయాల్సిన రైతు సమన్వయ సమితి కమిటీలు ఎక్కడున్నాయో  కూడా తెలియన పరిస్థితుల్లో రైతులు,  అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

 స్థల సేకరణలోనే జాప్యం

రైతు భవనాల ఏర్పాటు చేసి వాటిల్లో  రైతులకు ఆధునిక పద్దతుల్లో వ్యవసాయ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   కానీ అ భవన నిర్మానాలకు స్థలసేకరణ కూడా జరగలేదు. కార్యక్షేత్రంలో  రైతు సమన్వయ సమితి కమిటీ లక్ష్యాలు అమలుచేయడంలో వెనకడుగు వేస్తున్నాయి. ప్రధానంగా రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడిసాయం, భూసార పరీక్షల వల్ల ప్రయోజనాలు, పంటల మార్పి డితో వచ్చే దిగుబడులు, క్రాప్‌ కాలనీల ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ పనులు చేపట్టడం,  రైతులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, ఖరీఫ్‌, రబీ సీజన్‌లో దిగుబడి అయిన పంటలకు మద్దతు ధర, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవ సాయ పనిముట్ల వినియోగం, రైతులకు సబ్సిడీపై అందుతున్న విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, సేంద్రి య వ్యవసాయ పద్ధతులు, రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు  తదితర వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది.

వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, ఉపాధిహామీ పథకం, పశుసంవర్థక శాఖ అధికారులు పలు అంశా లపై చర్చించనున్నారు. రైతు సమన్వయ సమితి సభ్యు లు ఇక నుంచి గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పా టు చేసుకుని ఏయే పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుంది. రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి యేటా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ  ప్రభుత్వ ఆదేశాలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. జిల్లాలో2,51,945 మంది రైతులు ప్రతి ఏడాది సుమారుగా ఖరీఫ్‌లో 1,68,290 హెక్టార్లు, రబీలో 27వేల హెక్టార్లలో పంటల  సాగు చేస్తున్నారు.