రైతు సమస్యలపై చర్చించేందుకు సిద్ధం: రైతు స్వరాజ్య వేదిక

రైతు సమస్యలపై చర్చించేందుకు సిద్ధం: రైతు స్వరాజ్య వేదిక

రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం పై చేసిన బెదిరింపులను తీవ్రంగా ఖండించారు. పౌర సమాజంపై, క్షేత్ర స్థాయిలో రైతులతో పని చేసే కార్యకర్తల పై బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. రైతాంగానికి సంబంధించిన ఏ విషయం పై అయినా నిర్దిష్ట గణాంకాలతో చర్చించడానికి రైతు స్వరాజ్య వేదిక సిద్ధంగా ఉందని చెప్పారు.కానీ ఈ విషయాలపై చర్చించకుండా నోరు మూయించే ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రైతు స్వరాజ్య వేదిక రాజకీయ పార్టీలతో అనుబంధం లేని స్వతంత్ర సంఘంగా 12 సంవత్సరాలుగా రైతులతో పని చేస్తుందన్నారు.

రైతుల సమస్యల పై పని చేస్తున్న ప్రజా సంఘాలను బెదిరించడం ప్రజా స్వామిక ప్రభుత్వానికి తగదన్నారు.  రైతు ఆత్మహత్య కుటుంబాలన్నింటికీ జీవో 194 ప్రకారం నష్ట పరిహారం అందించాలని సూచించారు. కౌలు రైతుల కు 2011 సాగుదారుల గుర్తింపు చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్​ చేశారు.  రైతాంగ సమస్యలపై ఎప్పుడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని  రైతు స్వరాజ్య వేదిక నాయకులు స్పష్టం చేశారు.