రైతు వేదికలకు తాళాలు

రైతు వేదికలకు తాళాలు
  • 70 శాతం బిల్డింగులు ఉత్తగనే..
  • అధికారులు ఉండరు.. సిబ్బంది లేరు 
  • రైతులకు శిక్షణ ఇవ్వరు.. భూసార పరీక్షలు చెయ్యరు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు నిత్యం తాళాలతో దర్శనమిస్తున్నాయి. క్లస్టర్ కు సంబంధించిన ఏఈవో ఫీల్డ్‌‌‌‌‌‌‌‌కు పోతే వేదికలకు తాళాలు వేసేస్తున్నారు. దీంతో దాదాపు 70 శాతం రైతు వేదికలు నిరుపయోగంగా మారాయి. రైతు వేదికలకు ఎప్పుడు తాళాలే ఉంటున్నాయని, దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 2,604 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. ప్రతి క్లస్టర్​కు రూ.22 లక్షల చొప్పున రూ. 573 కోట్లు ఖర్చు చేసింది. 

సంబురాలకే పరిమితం... 
రైతు వేదికల్లో మోడ్రన్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ, ప్రత్యేక సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎరువులు, పురుగు మందుల వాడకం, విత్తనాల ఎంపికపై అవగాహన కల్పిస్తామంది. కానీ ఇప్పటి వరకు ఒక్క దగ్గర కూడా శిక్షణ ఇవ్వలేదు. ‘‘యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఒక్కసారి మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టిన్రు. రైతుబంధు సంబురాలు, ముగ్గుల పోటీలు తప్ప.. ఒక్క రోజు కూడా రైతులకు పంటలపై అవగాహన కల్పించలేదు” అని రైతులు చెబుతున్నారు. ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇప్పటి వరకు  గైడ్​లైన్స్ రాలేదని వ్యవసాశాఖ అధికారులు, ఏఈవోలు అంటున్నారు. ఏఈవోలకు ప్రత్యేక ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేసి, రైతు వేదికల్లోనే భూసార పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ వేదికల్లో సాయిల్ టెస్టు కిట్లే లేవని రైతులు అంటున్నారు. 

మెయింటెనెన్స్ డబ్బులిస్తలేరు..  
లక్షలు పెట్టి ఊరవతల కట్టిన ఈ రైతు వేదికల్లో సరైన సౌలతులు కూడా లేవు. చాలాచోట్ల టాయిలెట్స్ లేకపోవడంతో మహిళా ఏఈవోలు అక్కడికి వెళ్లడం లేదు. చాలాచోట్ల పూర్తి స్థాయిలో ఫర్నీచర్‌‌‌‌‌‌‌‌ లేదు. గత వర్షాకాలంలో కొన్ని వేదికల రేకులు లేచిపోయాయి. కొన్ని చోట్ల వడ్ల బస్తాలు నిల్వ చేయడానికి జాగ లేక, రైతు వేదికల్లోనే పెడుతున్నారు. మరోవైపు మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌కు డబ్బులు ఇవ్వడం లేదని ఏఈవోలు వాపోతున్నరు. ఏడాదికి రూ.24 వేలు ఇస్తామని సర్కార్ చెప్పినా.. పై అధికారులు పైసా ఇవ్వడం లేదని, కరెంటు బిల్లు కూడా కట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వీఆర్‌‌‌‌‌‌‌‌ఏ, వీఆర్‌‌‌‌‌‌‌‌వోలు పని లేక ఖాళీగా ఉంటున్నారని.. కనీసం వారినైనా రైతు వేదికల్లో సిబ్బందిగా నియమించాలని కోరుతున్నారు.