కౌలు రైతులను రైతుల్లా చూడడం లేదు:ఆకునూరి మురళి

కౌలు రైతులను రైతుల్లా చూడడం లేదు:ఆకునూరి మురళి
  • భూస్వాముల కోసమే రైతుబంధు
  • పంట బీమాలేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఫైర్


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో భూస్వాముల కోసమే రైతుబంధు అమలు చేస్తున్నారని రిటైర్డ్​ఐఏఎస్  ఆకునూరి మురళి అన్నారు. సినీ నటుడు నాగార్జున లాంటి వారికి, భూస్వాములకే రైతుబంధు అందుతున్నదని, చాలా మంది సామాన్య రైతులకు అందడం లేదన్నారు. కౌలు రైతులను  సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌  రైతుల్లాగా చూడడం లేదని ఆయన ఫైరయ్యారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో ‘తెలంగాణలో వ్యవసాయం ఎట్లుంది?  ఎట్లుండాలి?’  అంశంపై మీద సోషల్‌‌‌‌ డెమోక్రటిక్‌‌‌‌   ఫోరం సమావేశం నిర్వహించింది.

 వ్యవసాయ విధానంపై ఒక మేనిఫెస్టో తయారుచేసి దానిని పుస్తక రూపంలో ఫోరం కన్వీనర్‌‌‌‌ ‌‌‌‌ ఆకునూరి మురళి, ప్రొఫెసర్  పద్మజా షా విడుదల చేశారు. అనంతరం మురళి మాట్లాడుతూ రైతుల కోసం వ్యవసాయ కమిషన్‌‌‌‌  ఏర్పాటు చేయాలన్నారు. విద్యావ్యాపారం చేసే పల్లా రాజేశ్వర్‌‌‌‌ ‌‌‌‌రెడ్డిని రైతుబంధు సమితికి అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. సహకార సంఘాలు, మార్కెట్‌‌‌‌ కమిటీలు బలోపేతం కాకుండా రాజకీయ లబ్ధి కోసమే వాటిని వాడుకుంటున్నారని మండిపడ్డారు.

 ‘‘గత ప్రభుత్వాలు చాలా విత్తనాలకు రైతులకు సబ్సిడీ ఇచ్చేవి. కేసీఆర్  ప్రభుత్వం రాయితీ ఇవ్వట్లేదు. రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునేందుకూ సరైన సదుపాయం లేదు. రాష్ట్రంలో 124 ప్రైవేట్‌‌‌‌ కోల్డ్‌‌‌‌  స్టోరేజీలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం కోల్డ్‌‌‌‌  స్టోరేజీలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది” అని మురళి పేర్కొన్నారు. పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు ఏడువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. కేసీఆర్  ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదన్నారు.