కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి రిటైర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ కె.ప్రభాకర్, జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటస్వామి విమర్శించారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడలో నిర్వహించిన సమావేశంలో జిల్లా నూతన కార్యకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి రిటైర్డు కార్మికులకు అరకొర పెన్షన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్స్‌కు కనీసం రూ.10 వేల ఇవ్వాలని ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.
ఈపీఎస్‌లో రిటైర్డు అయిన కార్మికుల పెన్షన్ కూడా పెరగడం లేదని చెప్పారు.2018 ఫిబ్రవరిలో రిటైర్డు అయిన కార్మికులకు రూ.20 లక్షల చొప్పున గ్రాట్యూటీని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 21న మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ ఆవరణలో పెన్సర్స్ డేను నిర్వహించనున్నట్లు తెలిపారు. నూత కమిటీ జిల్లా ప్రచార కార్యదర్శిగా జి.చక్రధర్‌రావు, ఉపాధ్యక్షులుగా బోనగిరి రాజారెడ్డి, కేఎంసీ రెడ్డి, బి.కుమారస్వామి, ఎం.పాండురంగ, జాగిడి బాబు, సెక్రటరీగా కె.ముజారక్, కె.జగన్మోహన్ను ఎన్నుకున్నారు.
