
ప్రతీ ఏటా తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచినవారికి దాసరి ఫిలిం అవార్డ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దర్శక రత్న దాసరి నారాయణరావు 78వ జయంతి (2025 మే 4) వేడుకలో భాగంగా.. శుక్రవారం మే2న అవార్డులు అందించారు.
ఈ ఏడాది 2025కి గానూ అనూహ్యంగా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అందుకుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'శబరి' ఉత్తమ కథా చిత్రంగా దాసరి ఫిలిం అవార్డ్ కైవసం చేసుకుంది. ఈ అవార్డును శబరి సినిమాను నిర్మించిన ఎన్ఆర్ఐ మహేంద్ర నాథ్ కూండ్లకు సీనియర్ నటుడు మురళి మోహన్ అందించారు.
అలాగే, యంగ్ డెబ్యూ డైరెక్టర్ విభాగంలో నటుడు, దర్శకుడు ధనరాజ్ దాసరి అవార్డును గెలుచుకున్నారు. రామం రాఘవం సినిమాకుగానూ ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డుల కార్యక్రమంలో నటులు సుమన్, సాయి కుమార్, డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు.
అయితే, ఈ రెండు సినిమాల్లో కథా బలమున్న అంశాలను ఆధారంగా ఈ అవార్డులు అందించారు. శబరి సినిమాలో ఒక తల్లి తన బిడ్డను రక్షించేందుకు చేసిన ఒంటరి పోరాటాన్ని భావోద్వేగాలతో తెరకెక్కించారు. ఇకపోతే నిజాయితీపరుడైన తండ్రి...అడ్డదారుల్లో పయనించే కొడుకు.. వారిద్దరి మధ్య విద్వేషాలు, విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీసాయన్న అంశాలతో రామం రాఘవం సినిమాని ధన్ రాజ్ తెరకెక్కించాడు. ఇవెక్కడ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం.
దర్శకరత్న దాసరి నారాయణరావు గారి అవార్డు అందుకోవడం నూతన దర్శకుడిగా గర్వంగా ఉంది 🤗. సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు🙏🏿🙏🏿#RamamRaghavam pic.twitter.com/vqyO0Sgwu5
— Dhanraj koranani (@DhanrajOffl) May 2, 2025
‘శబరి’ ఓటీటీ:
‘శబరి’ మూవీ 2024 మేలో థియేటర్లలో విడుదలైంది. యాక్షన్, సైన్స్ ఫిక్షన్, డ్రామా వంటి అంశాలతో మిస్టరీ థ్రిల్లర్‌గా తెలుగులో శబరి రిలీజై ఆకట్టుకుంది. ప్రస్తుతం శబరి మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా, అమెజాన్ ప్రైమ్, సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీల్లో అందుబాటులో ఉంది.
కథేంటంటే:
సంజన(వరలక్ష్మి శరత్ కుమార్).. భర్త అరవింద్(గణేష్ వెంకట్ రామన్)ని వదిలేసి కూతురు(బేబీ నివేక్ష)తో సింగిల్ గా ఉంటుంది. ముంబై నుంచి వైజాగ్ వచ్చి ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే తన కాలేజీ ఫ్రెండ్ లాయర్ రాహుల్(శశాంక్)ని కాలుస్తాడు. అతని సహాయంతో జుంబా డాన్స్ ట్రైనర్ గా జాయిన్ అవుతుంది. మరోపక్క.. సంజనకు తనని, తన కూతురుని ఓ క్రిమినల్ చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అదే విషయాన్నీ పోలీసులకు చెప్పగా.. వాళ్ళు విచారణ చేస్తే ఆ క్రిమినల్ అప్పటికే చనిపోయాడని తెలుస్తుంది. మరోవైపు సంజన భర్త కూతురిని తనకు ఇవ్వాలని కోర్టుకు వెళ్తాడు. అసలు సంజన అరవింద్ ని ఎందుకు వదిలేసింది? సంజనని చంపడానికి వెంబడిస్తున్న ఆ క్రిమినల్ ఎవరు? కూతురు కోసం సంజన ఏం చేసింది? అనేది మిగిలిన కథ.
రామం రాఘవం ఓటీటీ:
ఈ మూవీ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్లో ఉంది. ఈటీవీ విన్, సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నిజాయితీపరుడైన తండ్రి...అడ్డదారుల్లో పయనించే కొడుకు.. వారిద్దరి మధ్య విద్వేషాలు, విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీసాయన్నదే రామం రాఘవం మూవీ కథ.
కథేంటంటే:
సబ్ రిజిస్ట్రార్ దశరథ రామం (సముద్రఖని) చాలా నిజాయితీపరుడు. తన కొడుకు రాఘవ (ధన్‌రాజ్) అంటే చాలా ప్రేమ. కొడుకుని ఎంతో గారాబంగా పెంచుతాడు. ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుక్షణం తపిస్తుంటాడు. అందుకు డాక్టర్‌ని చేయాలని కలలు కంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేసి జులాయిగా తిరుగుతాడు. మద్యం, సిగరేట్లు తాగుతూ జీవితాన్ని పాడుచేసుకుంటాడు. ఈజీ మనీ కోసం ఎదురొచ్చిన అడ్డదారులన్ని తొక్కుతాడు.
అందులో భాగంగా అనేక తప్పులు చేస్తుంటాడు. ఓ సారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. సొంత తండ్రే అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక తండ్రినే చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్ దేవ (హరీస్ ఉత్తమన్)తో హత్యకు డీల్ కుదుర్చుకుంటాడు.
ప్రాణంగా ప్రేమించిన తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్ చేసుకున్న డీల్ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే రామం రాఘవం సినిమా చూడాల్సిందే.