
త్వరలో టీఆర్ఎస్ లోకి సబితా ఇంద్రారెడ్డి
కేసీఆర్ ను కలిసిన తర్వాత మా నిర్ణయం సరైనదే అనిపించింది: కార్తీక్ రెడ్డి
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కుమారులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డితో కలిసి ఈ సాయంత్రం ఆమె సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. రాష్ట్ర రాజకీయాలు, చేవెళ్ల ఎంపీ టికెట్, మంత్రివర్గంలో బెర్త్ అంశాలపై మాట్లాడినట్టు సమాచారం. చేవెళ్ల ఎంపీ టికెట్ ను కార్తీక్ రెడ్డికి ఇవ్వాలని కేసీఆర్ ను సబిత కోరారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా కార్తీక్ రెడ్డిని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సబిత, ఆమె కుమారులతో గంట సేపు చర్చించారు కేసీఆర్. సమావేశం ముగిసిన తర్వాత కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మర్యాద పూర్వకంగా కేసీఆర్ ని కలిశామని కార్తీక్ రెడ్డి చెప్పారు. పార్టీలో ఎప్పుడు చేరేది కేసీఆర్ నిర్ణయిస్తారని వివరించారు. కేసీఆర్ ని కలిసిన తర్వాత… పార్టీ మార్పుపై తాము తీసుకున్న నిర్ణయం సరైనదే అని అనిపించిందని కార్తీక్ రెడ్డి చెప్పారు. అంతర్గత విషయాలు బయటకు చెప్పలేమని అన్నారు.