ఐదో విడత గ్రీన్‌‌ ఇండియా చాలెంజ్‌‌ ప్రారంభం 

ఐదో విడత గ్రీన్‌‌ ఇండియా చాలెంజ్‌‌ ప్రారంభం 
  • ఇషా ఫౌండేషన్‌‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌‌
  • ఐదో విడత గ్రీన్‌‌ ఇండియా ఛాలెంజ్‌‌ ప్రారంభం 

హైదరాబాద్‌‌, వెలుగు: పచ్చదనం పెంపులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఇషా ఫౌండేషన్‌‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌‌ అన్నారు. ‘‘సేవ్‌‌ సాయిల్‌‌’’యాత్రలో భాగంగా గురువారం ఆయన హైదరాబాద్‌‌కు వచ్చారు. శంషాబాద్‌‌ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో ఐదో విడత గ్రీన్‌‌ ఇండియా చాలెంజ్‌‌ను మొక్క నాటి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జగ్గీ వాసుదేవ్‌‌ మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెను ముప్పులా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు గ్రీన్‌‌ ఇండియా చాలెంజ్‌‌ తరహా పోటీని స్వీకరించాలని సూచించారు. సేవ్‌‌ సాయిల్‌‌, గ్రీన్‌‌ ఇండియా చాలెంజ్‌‌ లక్ష్యం పుడమిని కాపాడటమేని పేర్కొన్నారు. దేశం పచ్చబడేందుకు ఎంపీ సంతోష్‌‌ కుమార్‌‌ గ్రీన్‌‌ ఇండియా చాలెంజ్‌‌ పేరుతో తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. తాను ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నానని, తెలంగాణలోకి రాగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌‌ తలపెట్టిన హరితహారం స్ఫూర్తితో దేశమంతటా హరిత భావజాలం వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో నాలుగేండ్ల క్రితం గ్రీన్‌‌ ఇండియా చాలెంజ్‌‌ ప్రారంభించానని ఎంపీ సంతోష్‌‌ కుమార్‌‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి సద్గురు ఆశీస్సులు దక్కడం, ఆయన ఈ చాలెంజ్‌‌ స్వీకరించడం తన అదృష్టమన్నారు. కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌‌, ఎంపీ రంజిత్‌‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌‌ గౌడ్‌‌, ఎమ్మెల్సీలు శంభీపూర్‌‌ రాజు, నవీన్‌‌ కుమార్‌‌, దండె విఠల్‌‌ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.