నాలుకనే ఫ్లూట్​గా చేసి..ఈలపాటతో పాపులర్ అవుతున్న సాగర్

నాలుకనే ఫ్లూట్​గా చేసి..ఈలపాటతో పాపులర్ అవుతున్న సాగర్
  • పెదవులు కదపకుండా ఈల వేస్తాడు...నాలుకనే ఫ్లూట్​గా చేసి పాటలు పాడతాడు

కొందరికి బొమ్మలేయడం హాబీ. ఇంకొందరికి ఆటలాడటం​. మరికొందరికి సింగింగ్, డాన్సింగ్, రీడింగ్​. అయితే వీటన్నింటికి కాస్త డిఫరెంట్​గా ఈల వేయడాన్ని హాబీగా చేసుకున్నాడు పొన్నాల సాగర్​. అందులో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. పెదవులు కదపకుండా ఈల వేస్తాడు. అలాగే నాలుకనే ఫ్లూట్​గా చేసుకుని పాటలు పాడతాడు. సోషల్ మీడియాలో  తన ఈల పాటలతో పాపులర్​ అవుతున్నాడు ఇప్పుడు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​కి చెందిన ఈ స్కూల్​ కరస్పాండెంట్​ గురించి మరిన్ని విషయాలు. 
సాధారణంగా పెదవులు కలుపుతూ చాలా మంది ఈల పాటలు పాడుతుంటారు. కానీ, సాగర్​ మాత్రం నాలుకను కదిలిస్తూ గాలిని వదులుతూ అచ్చం ఫ్లూట్​తో పాడినట్లు పాటలు పాడతాడు. ఓల్డ్​ క్లాసిక్స్​, మెలోడి, జానపదాలు, డివోషనల్​.. ఇలా అన్ని జానర్స్​ పాడతాడు. తెలుగుతో పాటు హిందీ పాటలు కూడా ఫ్లూట్​లో పలికిస్తాడు. ఈ క్రెడిట్​ అంతా  ఆరేండ్ల వయసులో తనలో దాగున్న టాలెంట్​ని గుర్తించిన అమ్మదే అంటాడు సాగర్​. 
నలుగురిలో ప్రత్యేకంగా..
మా అమ్మ  రోజ్​మేరీ  నేను చదువుకున్న జెడ్పీఎస్​ఎస్​ స్కూల్​లో సోషల్​, కల్చరల్​ టీచర్​. ఒకరోజు కల్చర్​ క్లాస్​లో స్టూడెంట్స్​కి ఈల వేయడం నేర్పించింది అమ్మ. నేను ఆ టెక్నిక్​ని త్వరగా క్యాచ్​ చేయడంతో ఈల వేయడంలో మరిన్ని టెక్నిక్స్​ చెప్పింది. మెల్లిగా ఈల పాటలు కూడా కట్టడం మొదలుపెట్టా. ట్యూన్​ బాగా రావడంతో మరింత ఎంకరేజ్​ చేసింది. అలా స్కూల్​ డేస్​లో మొదలైన ఈల హాబీ తర్వాత ప్యాషన్​గా మారింది. కానీ, ఈల పాటలు పాడేవాళ్లు లక్షల్లో ఉంటారు. వాళ్లలో ఒకడిగా నేనుంటే ప్రత్యేకత ఏముంటుంది అని, డిఫరెంట్​గా​ ట్రై చేయాలనుకున్నా. పెదవులు కదపకుండా ఈల పాటలు పాడటం ప్రాక్టీస్​ చేశా. మొదట్లో కష్టమైంది. కానీ, పట్టు వదలకుండా ప్రాక్టీస్​ చేశా. సక్సెస్​ అయ్యా.

అయితే నాలా పెదవులు కదపకుండా ఈల పాటలు పాడేవాళ్లు కూడా కొందరు ఉన్నారని తెలిసింది. వాళ్లందరికన్నా డిఫరెంట్​గా ఇంకేం చేయొచ్చన్న ఆలోచనతో నాలుకను కదిలిస్తూ గాలిని వదులుతూ  ఫ్లూట్​తో పాడినట్లు పాటలు పాడటం ప్రాక్టీస్​ చేశా. ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ ఇలాంటి ప్రయోగం చేయలేదు. దాంతో అందరి దృష్టి నా మీద పడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వందల్లో ప్రదర్శనలిచ్చా. ఇవన్నీ ఒకెత్తు అయితే ఎలాంటి మ్యూజిక్​ ఇనుస్ట్రుమెంట్స్​ లేకుండా  నాలుకని ఫ్లూట్​గా చేసి 0 నిమిషాల్లో 60 పాటలు పాడా. ఆ ప్రయత్నానికి ఇంటర్నేషనల్​ వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్​లో చోటు కూడా దక్కింది. కొన్ని అవార్డులు కూడా అందుకున్నా. వీటన్నింటితో పాటు నాకిష్టమైన సోషల్ సర్వీస్​లోనూ యాక్టివ్​గా ఉంటున్నా. 
ఇతర దేశాల నుంచి .. 
చిన్నప్పట్నించీ కష్టాల్లో ఉన్నోళ్లకి చేతనైనంత సాయం చేసేవాడ్ని. పెరిగి పెద్దయ్యేకొద్దీ నాలో ఆ హెల్పింగ్​ నేచర్​ కూడా పెరుగుతూ వచ్చింది. కానీ, ఈ దారిలో ఒక్కడినే నడిస్తే.. కొంతమందికి మాత్రమే సాయం అందుతుంది. అదే నలుగురినీ కలుపుకుంటే వీలైనంత ఎక్కువమందికి సాయ పడొచ్చు. ఈ ఆలోచనతోనే ఎనిమిదేండ్ల కిందట మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి ‘ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ’ని  మొదలుపెట్టా. దీని ద్వారా ఫండ్స్ కలెక్ట్​ చేసి వయసు పైబడ్డ వాళ్లకి , అనాథలకి, ఫిజికల్లీ డిసేబుల్డ్​  పిల్లలకి సాయం చేస్తున్నాం. వాళ్లకి అవసరమైన రోజువారీ సరుకులు, మెడిసిన్స్​ అందిస్తున్నాం.  ఓల్డేజ్​ హోమ్స్ కట్టడానికి డబ్బు సాయం చేస్తున్నాం.

అలాగే గవర్నమెంట్​ స్కూల్​, హస్టల్స్​లో  హైజీన్​ గురించి అవగాహన కల్పిస్తున్నాం.  అయితే  జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి చాలా దేశాల నుంచి నన్ను కొందరు కాంటాక్ట్​ చేస్తున్నారు. మా ఆర్గనైజేషన్​లో మంచి జీతం ఇస్తాం..పర్ఫార్మెన్స్​ ఇవ్వమని అడుగుతున్నారు. కానీ, ఇవన్నీ వదిలి వెళ్లలేక ఇక్కడే ఉంటున్నా.  ఫ్యూచర్​లో నా ఈల పాటలతో మరింత మందిని ఎంటర్​టైన్​ చేస్తానన్న నమ్మకం ఉంది.  ::: మందమర్రి, వెలుగు