నెలాఖరు వరకు షిరిడీ ఆలయం మూసివేత

నెలాఖరు వరకు షిరిడీ ఆలయం మూసివేత

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తుండడంతో రోజు రోజుకూ ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతోపాటు.. శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 వరకు లాక్ డౌన్ అమలు ప్రారంభించింది. అయినా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుతూనే ఉండడంతో జనం గుమిగూడే రద్దీ ప్రదేశాలను నివారించే మార్గాలపై పాలకులు దృష్టి సారించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని హెచ్చరించిన నేపధ్యంలో శ్రీ  షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ స్పందించి స్వచ్చందంగా ప్రకటన విడుదల చేసింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను నివారించేందుకు సోమవారం అర్ధరాత్రి నుండి ఆలయం నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెలాఖరు వరకు ఆలయం మూసివేసే ఉంటుందని, భక్తులెవరూ దర్శనం కోసం ఆలయానికి రావద్దని కోరింది. సాయిబాబా ఆలయంతోపాటు ప్రసాదాలయ, భక్త నివాస్ లు కూడా వేసివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆలయం మూసివేత ఉన్నప్పటికీ నిత్యపూజలు ఏకాంతంగా జరుగుతాయని, భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ ఆస్పత్రి, ఇతర ఆస్పత్రులు యధావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది.