న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో కేంద్రం ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో 2 శాతం వరకు వాటాను అమ్మనుంది. ఈ విక్రయం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సుమారు 12.32 కోట్ల షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.ఐదు వేల కోట్లు రానున్నాయి.
ఈ ఓఎఫ్ఎస్ నాన్–-రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఈనెల 27న, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 29న ఓపెన్ అవుతుంది. ఒక శాతం బేస్ ఆఫర్, ఓవర్ సబ్‌స్క్రిప్షన్ వస్తే అదనంగా మరో ఒక శాతం గ్రీన్ షూ ఆప్షన్‌తో ఓఎఫ్ఎస్ ఉంటుందని కోల్ ఇండియా వర్గాలు తెలిపాయి. షేరు ధరను రూ.412గా నిర్ణయించారు.
బీఎస్ఈలో మంగళవారం కోల్ ఇండియా షేర్లు 0.25 శాతం పెరిగి రూ.458.25 వద్ద ముగిశాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే రూ.412 ఫ్లోర్ ధర 10 శాతం తక్కువగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలో జరుగుతున్న రెండో ఓఎఫ్ఎస్ ఇది. గత వారం ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓఎఫ్ఎస్ ద్వారా 8.08 శాతం వాటాను విక్రయించి రూ.2,266 కోట్లు వసూలు చేసింది.
