సింగరేణి సూపర్​బజార్లలో అమ్మకాలు పడిపోతున్నయ్

సింగరేణి సూపర్​బజార్లలో అమ్మకాలు పడిపోతున్నయ్
  • సిబ్బంది చేతివాటంతో నష్టాలు 
  • కమీషన్ల కోసం ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు
  • ఆర్కేపీలో వెలుగు చూసిన రూ.40 లక్షల స్కామ్

భద్రాద్రికొత్తగూడెం/రామకృష్ణాపూర్, వెలుగు: సింగరేణి గనుల్లో డ్యూటీలు నిర్వహించే  కార్మికులకు నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో నెలకొల్పిన సింగరేణి సూపర్​బజార్లు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. సిబ్బంది చేతివాటంతో నష్టాలు రావడం, అదే సమయంలో అమ్మకాలు తగ్గడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. శ్రీరాంపూర్​లోని కౌంటర్​ను నష్టాలతో ఇప్పటికే మూసివేయగా తాజాగా రామకృష్ణాపూర్​సింగరేణి సూపర్​బజార్​లో రూ.40 లక్షల స్కామ్​వెలుగుచూసింది. ఆడిట్​ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తే స్కామ్​ తీవ్రత మరింత పెరగవచ్చని ప్రచారం జరుగుతోంది. సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కావాల్సిన నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో 1974లో సింగరేణి ఎంప్లాయీస్​ మెంబర్​షిప్​ (రూ.361)తో  కంపెనీ సూపర్​బజార్లను ఏర్పాటు చేసింది.

మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 26 డిపోలు(సూపర్ బజార్లు), ఎంప్లాయీస్, ఆఫీసర్లకు వంటగ్యాస్​ సిలిండర్ల సప్లయ్​ కోసం 18 గ్యాస్ ఏజెన్సీలు నడుపుతున్నారు. ఇందులో వందకుపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 2016–17లో సింగరేణి సూపర్​బజార్లను ప్రైవేట్​మాల్స్​కు దీటుగా తీర్చిదిద్దారు. తక్కువ ధరకు క్వాలిటీ సరుకులు అందించడంతో ఒక్కసారిగా అన్ని విక్రయ కౌంటర్లలో సగటున నెలకు రూ.20 నుంచి 25లక్షల చొప్పున అమ్మకాలు జరిగాయి. సూపర్​బజార్లలో ఇంట్లోకి అవసరమయ్యే నిత్యావసరాలతో పాటు ఏసీలు, కూలర్లు, మిక్సీలు, కలర్​టీవీలు, ఫ్రిడ్జ్​లు విక్రయించేవారు. సింగరేణి ఎంప్లాయీస్​కు ఈఎంఐ ద్వారా వస్తువులు, సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపించడంతో ఇటీవలి కాలంలో విక్రయాలు రూ. 3 నుంచి 4 లక్షలకు పడిపోయాయి. 

సిబ్బంది చేతివాటం

సింగరేణి సూపర్​బజార్ల మనుగడపై సిబ్బంది చేతివాటం తీవ్ర ప్రభావం చూపుతోంది. తరచూ వివిధ రూపాల్లో స్కామ్​లు బయటకు వస్తున్నా సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. రామకృష్ణాపూర్​సూపర్​బజార్​లోని గ్యాస్​కౌంటర్​ను తనిఖీ చేసిన అడిట్​ఆఫీసర్లు సుమారు రూ.36 లక్షల వరకు స్కామ్​ జరిగినట్లు గుర్తించారు. ఇందుకు సూపర్ మార్కెట్​కౌంటర్​సెల్స్​మెన్ ను బాధ్యుడిగా గుర్తించారు. గ్యాస్​ కౌంటర్​ సేల్స్​మెన్​ నిత్యం వసూలైన డబ్బులను బ్యాంకులో జమ చేయాలి. అతనికి బదులు సూపర్​మార్కెట్​ సేల్స్​మెన్  జమ చేయడం స్కామ్​కు కారణమైంది. ఆ సేల్స్​మెన్​సూపర్​బజార్​కు సంబంధించిన డబ్బులను ఓచర్లపై ఎక్కువ రాసి బ్యాంకులో మాత్రం తక్కువ జమ చేశాడు. అలా మిగుల్చుకున్న మొత్తాన్ని​ సొంతానికి వాడుకున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఈ తతంగం గత ఏడాది డిసెంబర్ నుంచి జరుగుతున్నా ఆఫీసర్ల పర్యవేక్షణ లేకుండా పోయింది. దీనికితోడు మరొకరు సైతం రూ.10 లక్షల వరకు వాడుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో మందమర్రి సూపర్​బజార్​లో సేల్స్​మెన్​ రూ.12లక్షల స్కామ్​చేసి రెండేళ్లుగా పత్తా లేకుండా పోయాడు.  శ్రీరాంపూర్​ కృష్ణాకాలనీలో రూ.4 లక్షల కుంభకోణం జరిగింది. తాజాగా అదే ఏరియా పరిధిలో మరో ఇద్దరు రూ. 6 లక్షల వరకు సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. ఇల్లా ప్రతిచోట సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం నష్టాలకు కారణమవుతోంది. నష్టాలు వస్తున్నాయని శ్రీరాంపూర్​ కాలనీలోని సూపర్​బజార్​ను కొద్దిరోజుల కింద మూసివేశారు.  రెండు మూడేళ్లుగా అవసరం లేని సరుకులు కొనుగోలు చేయడంతో అమ్మకాలు లేక రూ.35 లక్షల విలువైన సామగ్రి నిరుపయోగంగా ఉన్నట్లు సమాచారం. మార్చి 28న శ్రీరాంపూర్​కృష్ణాకాలనీ కౌంటర్​ దహనమైన ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్రమాలు బయటపడకుండా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారనే ప్రచారం జరుగుతోంది. దహనం విషయంపై స్థానిక పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. 

గాడిలో పెట్టేందుకు చర్యలు

కోల్​బెల్ట్​వ్యాప్తంగా సింగరేణి సూపర్​బజార్లను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టాం. కొన్ని అక్రమాలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. వాటిపై విచారణకు ఆదేశించాం. ఆడిట్​లో కొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అవినీతికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటాం. 
– ఎ. ఆనందరావు, చైర్మన్, సింగరేణి కోఆపరేటివ్​ సెంట్రల్​ సూపర్ ​బజార్ ​సొసైటీ