
- ఆ కళాశాలలో 10 వేల మందికి ఫ్రీ ఎడ్యుకేషన్
- ఉపాధి కూడా చూపిస్తున్నరు
- ఆక్రమణపై నోటీసులిచ్చాం...తుది నిర్ణయం పెండింగ్‌లో ఉంది
- సల్కం చెరువు ఆక్రణమణపై ‘ఎక్స్’లో ప్రశ్నకు హైడ్రా చీఫ్సమాధానం
హైదరాబాద్ సిటీ, వెలుగు : తాము జీవితాలను నాశనం చేసే పని చేయమని హైడ్రా చీఫ్రంగనాథ్ అన్నారు. కబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తూనే, మానవతా దృక్పథాన్ని విస్మరించబోమని స్పష్టం చేశారు. అదివారం సోషల్‌మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా సల్కం చెరువు పరిధిలో నిర్మించిన ఫాతిమా ఒవైసీ కాలేజీ కూల్చివేత గురించి ఒకరు ప్రశ్నించగా ‘అక్బరుద్దీన్ పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజీ నిర్మించారు.
ఆ కళాశాలలో 10 వేల మంది పేద ముస్లిం విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. మేము వారి జీవితాలను నాశనం చేయలేం.. ప్రాథమికంగా నోటీసులిచ్చాం. కానీ, తుది నిర్ణయం పెండింగ్‌లో ఉంది. వాస్తవాలను పరిశీలించి, న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం’ అని అన్నారు.
అందుకే నోటీసులు ఇవ్వట్లేదు
హైడ్రా పనితీరుపై రంగనాథ్మాట్లాడుతూ ‘ఆక్రమణల తొలగింపులో పక్షపాతానికి తావులేదు. ఫిర్యాదు అందిన వెంటనే, వీడియో రికార్డింగ్ చేస్తూ పారదర్శకంగా విచారణ జరుపుతున్నాం చెరువులు, నాలాలు, రోడ్లపై ఉన్న కబ్జాలను ముందస్తు నోటీసులు లేకుండా తొలగించవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును కచ్చితంగా పాటిస్తున్నాం’ అని తేల్చి చెప్పారు. కబ్జాల వల్ల నష్టపోయిన నిజమైన కొనుగోలుదారులు కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ఉందన్నారు.
రూ. 1000 కోట్ల ఆస్తుల స్వాధీనం
గత ఏడాది హైడ్రా సాధించిన విజయాలను వివరిస్తూ ‘బుమ్రా చెరువు వద్ద రూ.1000 కోట్లు, చాంద్రాయణగుట్టలో రూ.30 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్నాం. మా చర్యల వల్ల గండిపేట, ఎన్-కన్వెన్షన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు’ అని అన్నారు. అలాగే, బండ్లగూడ జాగీర్ సన్‌సిటీలో పార్కులు లేవన్న ఫిర్యాదుపై స్పందిస్తూ, హైదరాబాద్‌లో ఇప్పటికే 60- నుంచి 70 పార్కులను పునరుద్ధరించామని, స్థానిక సంక్షేమ సంఘాలు ముందుకు వస్తే, వారితో కలిసి పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆక్రమణలపై తనను ఎవ్వరైనా ఎప్పుడైనా కలవ వచ్చన్నారు.