IND vs PAK: ఆందోళనలో పాకిస్థాన్.. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సల్మాన్‌కు గాయం

IND vs PAK: ఆందోళనలో పాకిస్థాన్.. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సల్మాన్‌కు గాయం

ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ టోర్నీకే ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా దాయాధి జట్లు తలపడనున్నాయి. గతంతో పోలిస్తే ఈ మ్యాచ్ కు కొంచెం క్రేజ్ తగ్గిన మాట నిజమే అయినా ఈ రెండు జట్ల మధ్య ఎప్పటికీ ప్రత్యేకమే. చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ లో తలపడిన రెండు జట్లు మళ్ళీ అదే గ్రౌండ్ లో ఏడు నెలల తర్వాత మ్యాచ్ కు సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ కు మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పుడు ఒక వార్త పాకిస్థాన్ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది.    

పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. మెడ గాయం కారణంగా ఇండియాతో జరగబోయే మ్యాచ్  ఆడడం అనుమానంగా మారింది. అసలే అనుభవం లేకుండా ఆడుతున్న పాకిస్థాన్ కు కెప్టెన్ దూరమైతే ఆ జట్టు గెలవడం మరింత కష్టంగా మారనుంది. రిపోర్ట్స్ ప్రకారం సల్మాన్ ఆఘా మెడపై బ్యాండేజ్‌తో కనిపించాడు. అతనికి స్వల్ప గాయమే అయినట్టు తెలుస్తోంది.  జట్టుతో కలిసి దుబాయ్ ప్రయాణించినా.. వార్మప్‌కు దూరంగా ఉన్నాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన శిక్షణా సెషన్‌కు మిగిలిన జట్టు మొత్తం ఫిట్‌నెస్ కసరత్తులు చేసినప్పటికీ సల్మాన్ దూరంగా ఉన్నాడు. 

ఆసియా కప్ లో ఇండియా- పాక్ మ్యాచ్ కు పెద్దగా బజ్ లేదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆసియా కప్ లో సెప్టెంబర్ 14 నుంచి జరగనున్న మ్యాచ్ కు ఇంకా టికెట్స్ అమ్ముడుపోకపోవడమే ఇందుకు కారణం.  రెండు జట్ల మధ్య మ్యాచ్ కు నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ ఇంకా సగానికి పైగా టికెట్స్ అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గత ఏడాది టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం కూడా మ్యాచ్ పై  హైప్ లేకపోవడానికి మరో కారణం.