హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ సందేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తానని బాలీవుడ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో గురువారం రాత్రి ముంబైలో సల్మాన్ ఖాన్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’పేరుతో ఒక డాక్యుమెంట్ రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాబోయే 20 ఏండ్లలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో రాష్ట్ర ప్రజల ఆలోచనలు, సూచనలను ఈ సర్వేలో సేకరిస్తున్నది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్కు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపొందిస్తున్న తీరును వివరించారు. డిసెంబర్లో నిర్వహించనున్న విజయోత్సవాల్లో పాల్గొనేందుకు రావాలని సీఎం కోరినట్లు తెలిసింది.
