KCL 2025: అసలు సిసలు విధ్వంసం: 12 బంతుల్లో 11 సిక్సర్లు.. ఒకే ఓవర్లో 40 పరుగులు

KCL 2025: అసలు సిసలు విధ్వంసం: 12 బంతుల్లో 11 సిక్సర్లు.. ఒకే ఓవర్లో 40 పరుగులు

కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో సిక్సర్ల సునామీ ఫ్యాన్స్ ను తెగ ఎంటర్ టైన్ మెంట్ చేసింది. సల్మాన్ నిజార్ తనకు సిక్సర్లు కొట్టడం తెప్పితే మరేం తెలియదన్నట్టు విధ్వంసం సృష్టించాడు. కాలికట్ గ్లోబ్‌స్టార్స్ తరపున ఆడుతున్న సల్మాన్.. అదానీ త్రివేండ్రం రాయల్స్‌తో శనివారం (ఆగస్టు 30) జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఊహకందని బ్యాటింగ్ తో 12 బంతుల వ్యవధిలోనే 11 సిక్సర్లు బాదేశాడు. టీ20 ఫార్మాట్ లో ఇది వరల్డ్ రికార్డ్ కావడం విశేషం. నిజార్ కు ముందు ఏ క్రికెటర్ కూడా తాను ఎదుర్కొన్న 12 బంతుల్లో 11 సిక్సర్లు కొట్టలేదు. అసలు సిసలు ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. 

ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 26 బంతుల్లోనే 12 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నిజార్ స్ట్రైక్ రేట్ ఏకంగా 330 ఉండడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన కాలికట్ గ్లోబ్‌స్టార్స్ మొదటి 18 ఓవర్లలో కేవలం 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి రెండు ఓవర్లలో మాత్రమే పూనకం వచ్చినట్టు ఆడాడు. బాసిల్ తంపి వేసిన ఇన్నింగ్స్ 19  ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది చివరి బాల్ సింగిల్ తీసుకున్నాడు. దీంతో ఈ ఓవర్ లో 31 పరుగులు వచ్చాయి. ఇక అభిజిత్ ప్రవీణ్ వేసిన 20 ఓవర్లలో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒక వైడ్, నో బాల్ కూడా వేయడంతో ఈ ఓవర్ లో మొత్తం 40 పరుగులు వచ్చాయి.

చివరి రెండు ఓవర్లలో గ్లోబ్‌స్టార్స్ ఏకంగా 71 పరుగులు రాబట్టుకుంది. 12 బంతులకు 12 సిక్సర్లు కొడితే 72 పరుగులు వస్తాయి. అయితే  నిజార్ విధ్వంసానికి 71 పరుగులు రావడం విశేషం. ఈ మ్యాచ్ లో సల్మాన్ నిజార్ ఊచకోతకు మొదట బ్యాటింగ్ చేసిన కాలికట్ గ్లోబ్‌స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అదానీ త్రివేండ్రం రాయల్స్ 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. దీంతో 13 పరుగుల తేడాతో కాలికట్ గ్లోబ్‌స్టార్స్ విజయం సాధించింది.