
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. అధికారులు,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నారని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఎల్బీ నగర్ కార్పొరేటర్లు ఆరోపించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భూ కబ్జాలు,అవినీతి బాగోతంపై వారానికి ఒక్కటి చొప్పున విడుదల చేస్తామని హెచ్చరించారు. మన్సూరాబాద్ లోని సర్వే నెంబర్ 51/2 జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రెండు ఎకరాల 10 గుంటల భూమిని ఆబ్కారీ శాఖకు కేటాయించడం జరిగిందని ఆ భూమిపై కన్నేసిన ఎమ్మెల్యే బినామీలతో కబ్జా చేశారని ఆరోపించారు.2019లో ప్రభుత్వ భూమి అని నోటీస్ ఇచ్చి తిరిగి ఆ భూమికి డోర్ నంబర్లు కేటాయించారన్నారు.2021 లో జోనల్ ఆఫీస్ లో జోనల్ కమిషనర్ దగ్గర తమకు డోర్ నెంబర్లు ఉన్నాయని చెప్పి షెడ్ కి పర్మిషన్ తీసుకున్నారని ఆబ్కారీ శాఖకు కేటాయించిన రెండు ఎకరాల భూమి ఇప్పుటికీ ధరణిలో ఆబ్కారీ భూమి అని చూపిస్తుందన్నారు. రూ.100 కోట్ల ప్రాపర్టీని ఎవ్వరికీ తెలియకుండా చడిచప్పుడు కాకుండా స్థానిక ఎమ్మెల్యే ప్రమేయంతో ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు.
ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సామరంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రమేయం లేకుండా ఎలా కబ్జా చేస్తు్న్నారని అందులో అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. దీనిపై రెవిన్యూ,ఏసీబీ సమగ్ర విచారణ చేసి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని తెలిపారు. ఎల్బీనగర్ ప్రజలకు ప్రతి అవినీతి పై ప్రతి వారం ఎపిసోడ్ గా ఒక్కొక్కటిగా సీడీలు రూపంలో తాము విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని... ఇక్కడ మాత్రం అలా జరగడం లేదన్నారు. ఎమ్మెల్యేనే కబ్జాలకు పాల్పడుతుంటే ఎవ్వరికి చెప్పుకోవాలన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తులు కాపాడుకొంటామని తెలియజేస్తున్నామన్నారు.
30 సంవత్సరాల క్రితం ఆబ్కారీ శాఖకు కేటాయించిన భూమి రెండేళ్లలోనే అవకతవకలు జరుగుతున్నాయని సామ రంగారెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ప్రభుత్వ భూమి,తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రవేట్ భూమి ఎలా అవుతుందన్నారు. ప్రజల అవసరాల కోసం ఎమ్మెల్యే పార్టీ మారలేదని ఆయన స్వార్థం కోసం కబ్జాలకోసం మాత్రమే పార్టీలు మరి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అధికారులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కనుసన్నల్లో మాత్రమే పని చేస్తున్నారని పేర్కొన్నారు. కబ్జాలకు గురైన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నామని సామరంగారెడ్డి స్పష్టం చేశారు.