యశోద అక్కడ ఎందుకుంది?

యశోద అక్కడ ఎందుకుంది?


యూటర్న్, ఓ బేబి లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల తర్వాత ‘యశోద’ అనే మరో వెరైటీ సినిమాతో రాబోతోంది సమంత. హరి- హరీష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. నిన్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌‌ను విడుదల చేశారు. యశోద అప్పుడే కళ్లు తెరిచింది. అన్ని సౌకర్యాలు ఉన్న ఆస్పత్రి గదిలా ఉందది.  రోజూ తను చూసే ప్రపంచం కాదది. తను వేసుకున్న బట్టలు, చేతికున్న బ్యాండ్, ఆ గది ఆమెకు కొత్తగా, వింతగా అనిపిస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినిపించేంత నిశబ్దం. దాన్ని ఛేదించేందుకు మెల్లిగా వెళ్లి కిటికీ తెరిచి చూసింది. స్వేచ్ఛకు ప్రతిరూపంలా కనిపిస్తోన్న తెల్లటి పావురాన్ని అందుకోబోయింది.  బయటి నుంచి చూస్తే భారీ భవనాల మధ్య ఓ పజిల్‌‌ తరహాలో సమంత ఉన్న గది కనిపిస్తోంది. ఇంతకూ ఆమె అక్కడ ఎందుకుంది, అక్కడేం జరుగుతోంది అనేది సస్పెన్స్. ‘ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో లాస్ట్ షెడ్యూల్‌‌ షూట్ చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. స్పెషల్ ఎఫెక్ట్స్‌‌కి ఇంపార్టెన్స్ ఉన్న చిత్రం. ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తాం’ అని నిర్మాత చెప్పారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీశర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.