
దేశంలో స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దత కల్పించాలా వద్దా అనే విషయంపై దాఖలైన పిటీషన్లపై విచారణను 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్దతకు సంబంధించిన పిటిషన్లపై ఏప్రిల్ 18వ తేదీన విచారణ ప్రారంభం కానుంది.
స్వలింగ సంపర్కుల వివాహాలపై దేశ వ్యాప్తంగా ఎంతో కాలంగా చర్చలు నడుస్తున్నాయి. స్వలింగ సంపర్కుల మ్యారేజీకి చట్టబద్ధతను కల్పించాలనే డిమాండ్ కొద్ది కాలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై కొందరు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలోనే విచారణకు చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించింది. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టుతో సహా పలు రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల ముందు పెండింగ్‌లో ఉన్న పిటిషన్లన్నింటినీ తమకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు జనవరి 6వ తేదీన ఆదేశించింది.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకుండా 2022 నవంబరులో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. స్వలింగ సంపర్కులు లేదా భిన్న లింగ సంపర్కులు పరస్పర అంగీకారంతో సెక్స్ చేయడం నేరం కాదని పేర్కొంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేసింది. దీనికి చట్టబద్ధతను కల్పించడం సరికాదని తేల్చి చెప్పింది. IPCలోని సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడం నేరమని తెలిపింది. స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో లేదని వివరించింది. భిన్న లింగ వివాహానికి మాత్రమే గుర్తింపు ఉందని వెల్లడించింది.