ఇవాళ, రేపు గద్దెపైనే వన దేవతలు

ఇవాళ, రేపు గద్దెపైనే వన దేవతలు
  • చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క
  • దారి పొడవునా భక్తుల పొర్లు దండాలు, పూనకాలు
  • నీళ్లారబోసి స్వాగతం పలికిన ఆడబిడ్డలు 
  • గౌరవ సూచకంగా  ‌‌ఏకే- 47 తుపాకీతో గాల్లోకి కాల్పులు
  • ఇయ్యాళ, రేపు గద్దెలపైనే వన దేవతలు 

భక్త జనమంతా గుండెల నిండా తలువంగ..
తొవ్వపొంట అడుగడుగునా రంగురంగుల పట్నాలు మెరువంగ.. 
కొమ్ముబూరలు, డోలువాయిద్యాలు, డప్పుల చప్పుళ్లు మోగంగ..
కుంకుమ భరిణె రూపంలో చిలుకలగుట్ట దిగి గద్దెలపైకి చేరింది సమ్మక్క.
మేడారం మహాజాతరలో గురువారం అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది.
వనదేవతలంతా గద్దెలపైకి చేరడంతో మేడారం పులకించిపోతున్నది.
సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును కనులారా చూసేందుకు భక్తులు తరలివస్తున్నరు. 

మేడారం ప్రతినిధి/ జయశంకర్‌‌‌‌‌‌‌‌భూపాలపల్లి, వెలుగు:  మేడారం మహాజాతర కీలక ఘట్టానికి చేరుకుంది. చిలుకలగుట్టలో కొలువైన తల్లి సమ్మక్క గురువారం రాత్రి గద్దెలపైకి చేరుకుంది. ఆ ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. ఆదివాసీ సంప్రదాయాలు, పూజలతో సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. సాయంత్రం చిలుకలగుట్ట నుంచి బయల్దేరిన సమ్మక్క రాత్రి 9.20 గంటలకు గద్దెపైకి చేరుకుంది. వన జాతరలో ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. అక్కడ్నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి పొడవునా ఇరువైపులా భక్తులు పబ్బతి పట్టారు. మేళతాళాలతో ఊరేగింపుగా సమ్మక్క వస్తున్న వేళ అమ్మవారికి గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ సంగ్రామ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ జి.పాటిల్‌‌‌‌  ‌‌‌‌ఏకే- 47తో గాల్లోకి నాలుగుసార్లు కాల్పులు జరిపి గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం నిర్వహించారు. 

ఉదయం నుంచే పూజలు 

సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలైంది. వడ్డెలు ఉదయం 5.30 గంటలకు వనం గుట్టకు వెళ్లి  కంకవనం(వెదురు కట్టెలు) తెచ్చి గద్దెలపై ప్రతిష్టించి.. ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడెరాల (కొత్త కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం సాయంత్రం మూడు గంటలకు చిలుకలగుట్టపైకి బయల్దేరి వెళ్లారు.  

చిలుకలగుట్టపై రహస్య పూజలు

తొలుత చిలుకలగుట్టపైకి సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, చందా బాబూరావు, సిద్ధబోయిన మునీందర్‌‌‌‌‌‌‌‌, సిద్ధబోయిన లక్ష్మణ్ రావు, ఎంపల్లి మహేశ్​ వెళ్లి పూజలు నిర్వహించి.. తల్లిని కిందికి తీసుకొచ్చారు. దూప వడ్డె నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు ధూపం పట్టగా, మల్లెల ముత్తయ్య జలకం పట్టితో కొక్కెర కృష్ణయ్య వెంట నడిచారు. తల్లిని చిలుకలగుట్ట కిందికి తీసుకురాగానే తల్లి రాకను సూచిస్తూ వసంతరావు, స్వామి, జనార్దన్‌‌‌‌‌‌‌‌రావు కొమ్ముబూరలు ఊదుతూ జయజయధ్వానాలు చేశారు. ఆ తర్వాత పూజారులు రాత్రి 7.17 గంటలకు బయల్దేరారు. మేడారంలోకి అడుగుపెట్టగానే గ్రామానికి చెందిన 11 మంది మహిళలు బిందెలతో నీళ్లు ఆరబోశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు మధ్యాహ్నమే సమ్మక్క వచ్చే దారినంతా ఊడ్చి, అలుకు చల్లి ముగ్గులు వేశారు. భక్తుల పూనకాలు, పొర్లు దండాలను దాటుకుంటూ కొక్కెర కృష్ణయ్య సమ్మక్కను రాత్రి 9.20 గంటలకు గద్దెలపైకి చేర్చారు.  చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెకు చేర్చే క్రమంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాల మధ్య గిరిజనులు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క వారితో కలిసి నృత్యం చేశారు. చిలుకలగుట్టపై నుంచి తీసుకొస్తున్న అమ్మవారిని,  మహిమాన్వితమైన కుంకుమ భరిణెను తాకడానికి తాకడానికి కొందరు భక్తులు ప్రయత్నించారు. ప్రధాన పూజారిని భక్తులు తాకకుండా పోలీసులు అతికష్టం మీద అడ్డుకున్నారు.

ఎదురుకోళ్ల మందిరం దగ్గర కాసేపు విశ్రాంతి

సమ్మక్క తల్లి ఎదురుకోళ్ల పూజామందిరం చేరుకున్న తర్వాత అక్కడ వడ్డెలు, పూజారులు ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం పూజారులు అక్కడే ప్రత్యేక పూజలు చేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య ముందుగా సమ్మక్క తల్లిని గుడికి తీసుకెళ్లి అక్కడ పూజలు చేసిన తర్వాత గద్దెలపైకి చేర్చారు. సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో గుడి ఆవరణలో కరెంట్​ సరఫరా నిలిపివేసి, తర్వాత కొనసాగించారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు. తల్లి బిడ్డలు గద్దెలపై ఉండటంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి పోటీ పడ్డారు.

రోడ్ల పొడవునా ముగ్గులు

సమ్మక్క రాక సందర్భంగా గుట్ట నుంచి గద్దెల వరకు దారి రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నిండిపోయింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ ఆడపడుచులు ఆటపాటలతో అలరించారు. శివసత్తులు, మహిళలు పూనకాలతో ఊగిపోయారు. భక్తులు మేకలు, కోళ్లు బలిచ్చారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని సమ్మక్కపై చల్లారు. సమ్మక్కను తీసుకెళ్లిన తర్వాత రోడ్డుపై వేసిన పసుపు, కుంకుమను భక్తులు కళ్లకు అద్దుకొని తీసుకున్నారు. ఏవైనా వస్తువులు దొరికినా మహద్భాగ్యమని తీసుకున్నారు. 

మొక్కులు చెల్లించిన  మంత్రులు

సమ్మక్క గద్దెకు చేరే కార్యక్రమం ఉండటంతో గురువారం పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌రెడ్డి  మేడారం వచ్చి అమ్మవార్లకు మొక్కులు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌రెడ్డి హెలీకాప్టర్‌‌‌‌‌‌‌‌లో తిరుగుతూ మేడారాన్ని పరిశీలించారు. మంత్రి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు ఆకస్మికంగా పర్యటించి ఆఫీసర్లకు తగు సూచనలు చేశారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.  

ఎస్పీ సంగ్రామ్​ సింగ్ కు రెండోసారి చాన్స్‌‌‌‌‌‌‌‌

ములుగు జిల్లాగా ఏర్పాటయ్యాక జాతర జరగడం ఇది రెండోసారి. 2020లో జాతర జరిగినప్పుడు సమ్మక్క చిలుకలగుట్ట దిగగానే ఎస్పీ సంగ్రాం సింగ్‌‌‌‌‌‌‌‌ జీ పాటిల్‌‌‌‌‌‌‌‌ తొలిసారి గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈసారి జాతరలోనూ ఎస్పీ హోదాలో ఆయనే ఆ ఘట్టం నిర్వహించారు.

దర్శనానికి లక్షలాది మంది భక్తుల రాక

సమ్మక్క రాకను వీక్షించాలని లక్షలాది మంది భక్తులు  చిలుకలగుట్ట దగ్గరికి విచ్చేయడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. గుట్ట పైనుంచి తీసుకొస్తుండగా తల్లిని కనులారా చూడాలని తపించిపోయారు. ఎత్తయిన ప్రదేశాలు, చెట్లు కొమ్మలపైకి ఎక్కి కూర్చున్నారు. తల్లుల దర్శనం కోసం గురువారం రాత్రి వరకే లక్షలాది మంది భక్తులు మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. కరోనా భయంతో గత రెండు నెలల్లో 40 లక్షల మందికి పైగా భక్తులు ముందస్తు  మొక్కులు చెల్లించుకోగా.. మహాజాతర ప్రారంభమైన తర్వాత  ఇప్పటి వరకు 70 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. తల్లులు గద్దెలపై ఉండే మరో రెండు రోజుల్లో 30 లక్షల మంది వరకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.