- వైద్య సేవల ట్రయల్ రన్‌ను పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ
- 1,000 బెడ్లతో పేదలకు కార్పొరేట్ వైద్యం.. 300 ఎమర్జెన్సీ బెడ్లు
- పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను జూన్ నెలలో ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం హాస్పిటల్లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను ఆయన పరిశీలించారు. హాస్పిటల్‌లోని ఏ, బీ, సీ బ్లాకుల్లో తిరిగి ఓపీ రిజిస్ట్రేషన్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ఐపీ వార్డులు, సీటీ స్కాన్, ఎంఆర్ఐ ల్యాబ్‌లు, కిచెన్ విభాగాలను తనిఖీ చేశారు.
ఫినిషింగ్ పనులు స్పీడప్ చేయండి..
హాస్పిటల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. హాస్పిటల్‌కు నీళ్లు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల పవర్ బ్యాకప్ ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడొద్దని, అన్ని ఫ్లోర్లలో మరోసారి పూర్తిస్థాయి ఆడిట్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పేషెంట్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఫార్మసీకౌంటర్ల సంఖ్యను పెంచాలని సూచించారు.
ఎమర్జెన్సీకే 300 బెడ్లు..
‘‘సనత్‌నగర్ టిమ్స్ కేవలం హాస్పిటల్ మాత్రమే కాదు, ఇదొక రీసెర్చ్ సెంటర్. వెయ్యి బెడ్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ హాస్పిటల్లో 300 బెడ్లను కేవలం ఎమర్జెన్సీ కోసమే కేటాయించాం. గుండె సంబంధిత వ్యాధులు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా నిలుస్తుంది. ఇక్కడ అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చాం”అని మంత్రి తెలిపారు. ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
