బెల్లంపల్లి రూరల్, వెలుగు: తీవ్రమైన తాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామపంచాయతీలోని మేదరివాడ, అశోక్‌నగర్ కాలనీల ప్రజలు రోడెక్కారు. కాలనీల్లో నీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందని, ప్రజలు సతమతమవుతున్నా అధికారులు స్పందించడం లేదని మంగళవారం రోడ్డుపై ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.
మంచినీటి సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. మూడు నెలల క్రితం కొత్త బోరు వేసినప్పటికీ మోటారు బిగించలేదన్నారు. స్పందించిన పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి దివాకర్, సర్పంచ్ సురేశ్స్పందించారు. ట్యాంకర్లను ఏర్పాటు చేసి కాలనీల్లో నీటిని సరఫరా చేశారు. అనంతర బోరుకు మోటారు బిగించి పైపులైన్‌కు అనుసంధానించడంతో సమస్య పరిష్కారమైంది.
