- అన్ని రకాల అవయవ మార్పిడి చికిత్సలకు కేరాఫ్ అడ్రస్: మంత్రి దామోదర
- నిమ్స్‌పై ఒత్తిడి తగ్గించడమే మెయిన్ టార్గెట్
- టిమ్స్ హాస్పిటల్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హెల్త్ మినిస్టర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సనత్‌నగర్ టిమ్స్‌ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ట్రాన్స్‌ప్లాంట్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. దశల వారీగా అన్ని రకాల ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ సేవలను ఇక్కడ స్టార్ట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం ఉదయం నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లతో కలిసి మంత్రి టిమ్స్‌ను విజిట్ చేశారు.
అక్కడ ఏర్పాటు చేసిన మోడ్రన్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, ప్రీ-ఆపరేటివ్, పోస్ట్-ఆపరేటివ్ వార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిమ్స్‌ను కేవలం హాస్పిటల్గానే కాకుండా సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ సెంటర్‌గా డెవలప్ చేస్తామన్నారు. దీనివల్ల గాంధీ, ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్స్ పై ఉన్న పేషెంట్ల ఒత్తిడి తగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నిమ్స్ పై భారం తగ్గించేలా...
నిమ్స్ హాస్పిటల్లో న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్, యూరాలజీ డిపార్ట్మెంట్లలో నిపుణులైన డాక్టర్లు ఉన్నప్పటికీ.. ఆపరేషన్ థియేటర్ల కొరత వల్ల పేషెంట్లు నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందని సర్జన్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. నిమ్స్‌లో పెండింగ్‌లో ఉన్న కిడ్నీ, గుండె, న్యూరో సంబంధిత శస్త్రచికిత్సలను టిమ్స్‌లో నిర్వహించేలా తక్షణమే కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
నిమ్స్ వైద్య బృందాలు టిమ్స్‌లోని థియేటర్లను వాడుకునేలా అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్‌కు సూచించారు. డాక్టర్ బీరప్ప, డాక్టర్ వాణి, డాక్టర్ రాకేశ్ సహాయ్, జీవన్‌దాన్ ఇన్చార్జి డాక్టర్ భూషణ్ రాజు పాల్గొన్నారు.
