పోయిన ఫోన్​ వెతికేందుకు వచ్చేసింది... సంచార్​ సాథీ

పోయిన ఫోన్​ వెతికేందుకు వచ్చేసింది... సంచార్​ సాథీ

న్యూఢిల్లీ : తమ ఫోన్లను పోగొట్టుకున్న దేశ ప్రజలు వాటిని ట్రాక్​లేదా బ్లాక్​ చేయడానికి వీలు కల్పించే సంచార్​ సాథీ పోర్టల్​ను డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికం మంగళవారం లాంఛ్​ చేసింది. పోయిన తమ మొబైల్స్​ ట్రాక్​ లేదా బ్లాక్​ చేసుకోవడంతోపాటు, ఇంతకు ముందు వేరెవరైనా వాడిన డివైస్​ను కొనుగోలు చేసే ముందు ఆ డివైస్​ సరైనదేనా, కాదా అనే అంశాన్ని కూడా సంచార్​ సాథీ పోర్టల్​ ద్వారా తెలుసుకోవచ్చని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్​ చెప్పారు. సంచార్​ సాథీ మొదటి దశ సెంట్రల్​ ఎక్విప్​మెంట్​ ఐడెంటిటీ రిజిస్టర్​(సీఈఐఆర్​).

" ఫోన్​ పోగొట్టుకున్న వారెవరైనా ఈ పోర్టల్​ను ఆశ్రయించొచ్చు. ఐడెంటిటీ వెరిఫికేషన్​, అవసరమైన అండర్​టేకింగ్​ ఇచ్చిన వెంటనే ఈ పోర్టల్​ లా ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజన్సీలు, టెలికం సర్వీస్​ ప్రొవైడర్లతో ఈ సంచార్​ సాథీ పోర్టల్​ ఇంటరాక్ట్​అయి, పోయిన ఫోన్​ బ్లాక్​అయ్యేలా చూస్తుందని" వైష్ణవ్​ వివరించారు. యూజర్​ సేఫ్టీ విషయంలో ప్రధాన మంత్రికి స్పష్టమైన విజన్​ ఉందని, ఆ విజన్​కు తగినట్లుగానే సంచార్​ సాథీ ఉంటుందని పేర్కొన్నారు. వాట్సప్​కాల్స్​ ద్వారా జరుగుతున్న మోసాలపై అడిగిన ప్రశ్నకు, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న వాట్సప్​ అకౌంట్లను డీయాక్టివేట్​ చేయడానికి మెటా కంపెనీ ఒప్పుకుందని అశ్విని వైష్ణవ్​ వెల్లడించారు.

కస్టమర్ల సేఫ్టీ  అత్యంత ముఖ్యమైనదేనని వాట్సప్​ కూడా తమతో ఏకీభవించిందని పేర్కొన్నారు. అలాగే ఫ్రాడ్స్​కు పాల్పడే వారుగా గుర్తించిన యూజర్లను డీరిజిస్టర్​ చేయడానికి ఓటీటీలు అంగీకరించాయని చెప్పారు. దేశంలో మోసాలకు పాల్పడుతున్నవిగా గుర్తించిన 36 లక్షల మొబైల్స్​ను డిస్కనెక్ట్​ చేశామని, సమాంతరంగా వాటి వాట్సప్​ అకౌంట్లు కూడా బ్లాకయ్యాయని మంత్రి వివరించారు. సంచార్​ సాథీ పోర్టల్​లోని నో యువర్​ మొబైల్​ ఫెసిలిటీ ద్వారా సెకండ్​ హ్యాండ్​ మొబైల్​కొనేవారు, ఆ హ్యాండ్​సెట్​పై వేరేదైనా నెంబర్స్​ పనిచేస్తున్నాయా అనేది తెలుసుకోవచ్చని అశ్విని వైష్ణవ్​ వెల్లడించారు. ఈ తాజా చొరవతో నానాటికీ ఎక్కువవుతున్న సైబర్​ మోసాలను కట్టడి చేయగలుగుతామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా, తమ అనుమతి లేకుండా తమ పేరుతో ఏవైనా మొబైల్​ నెంబర్లు పనిచేస్తున్నాయా అనే అంశం తెలుసుకోవడానికి టీఏఎఫ్​సీఓపీ ఫెసిలిటీ సంచార్​ సాథీలో ఉందని అన్నారు.