మణుగూరు మండలంలో కరెంట్ పోల్ను ఢీకొన్న ఇసుక లారీ

మణుగూరు మండలంలో కరెంట్ పోల్ను ఢీకొన్న ఇసుక లారీ
  • ఐదు కిలోమీటర్ల మేర నిలిచిన లారీలు, మూడు గ్రామాలకు కరెంట్ సప్లై బంద్ 
  • బస్సులు రాకపోవడంతో అయిదు కిలోమీటర్లు నడిచిన విద్యార్థులు, 

మణుగూరు, వెలుగు: ఇసుక లారీలు కరెంటు పోల్ ను ఢీకొట్టడంతో ఐదు కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయి విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మణుగూరు మండలం కమలాపురం, చిన్నరావి గూడెం గ్రామాలకు చెందిన ఇసుక క్వారీల నుంచి వందల సంఖ్యలో లారీలు కమలాపురం, కట్టు మల్లారం గ్రామాల నుంచి రవాణా సాగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

కొద్ది రోజుల క్రితం ఇసుక లారీల మూలంగా ఊరిలోకి అంబులెన్స్ రాకపోవడంతో గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. దీంతో టిజీఎండిసి అధికారులు ఇసుక కాంట్రాక్టర్లు ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కానీ రెండు రోజుల క్రితం కాంట్రాక్టర్లు మళ్లీ ఇసుక లారీలను నడపడంతో గ్రామస్తులు అడ్డుకోగా పోలీసులు గ్రామస్తులను తీవ్రంగా మందలించి లారీలను అనుమతించాలని చెప్పారు.  

గ్రామస్తులు పోలీసులు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. దౌర్జన్యంగా లారీలు నడుపుతున్న క్రమంలో మంగళవారం కమలాపురం గ్రామంలో ఓ ఇసుక లారీ కరెంటు పోల్ ను ఢీకొట్టడంతో మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. లారీలు నిలిచిపోవడంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

మూడు గ్రామాల్లోని విద్యార్థుల కోసం వచ్చే స్కూల్ బస్సులు రాకపోవడంతో ఐదు కిలోమీటర్లు విద్యార్థులు నడిచే వచ్చారు. పోలీసులు మాత్రం కచ్చితంగా లారీలను అనుమతించాలంటూ తమను బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని అయినా మా పరిస్థితులను అధికారులు అర్థం చేసుకోవడం లేదంటూ వారు మండిపడుతున్నారు.