అండర్​ గ్రౌండ్ గనులకు ఇసుక కొరత

అండర్​ గ్రౌండ్ గనులకు ఇసుక కొరత

మందమర్రి/ నస్పూర్, వెలుగు: ఎడతెరిపిలేని వానలతో సింగరేణి బొగ్గు గనులకు ఇసుక కొరత ఎదురవుతోంది. భారీ వరద కారణంగా ఇసుక తయారు చేసే పీఓబీ (ప్రాసెస్​ఓవర్​బర్డెన్) ప్లాంట్​ నీటమునగడం, గోదావరి నుంచి ఇసుక వెలికితీయలేని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని ఆరు అండర్​గ్రౌండ్​మైన్లకు 14 రోజులనుంచి ఇసుక సప్లయ్​జరగడంలేదు. పీఓబీ ప్లాంట్​ తిరిగి ఇసుక తయారీ చేసేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశం ఉండడంతో తాత్కాలికంగా  ఎస్టీపీపీ బాటమ్ యాష్​వాడాలని సింగరేణి భావిస్తోంది. ఇసుక సప్లయ్​మరింత ఆలస్యం అయితే  బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడనుంది. అండర్​గ్రౌండ్​ మైన్స్​లో  బొగ్గు వెలికితీసి..ఆ  ఖాళీ ప్రదేశాన్ని ఇసుకతో నింపుతుంటారు.  దీన్ని శాండ్ స్ర్టవింగ్ మైనింగ్ సిస్టం అంటారు. బొగ్గు వెలికితీసిన ప్రాంతం కూలకుండా, ఆ ప్రాంతంలో ఉత్పత్తి సజావుగా  సాగేందుకు ఈ సిస్టం ఉపయోగపడుతుంది. 

నీటిలోనే మెషీన్లు 
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియాలోని ఓసీపీ ఆవరణలో సింగరేణి సహకారంతో ప్రైవేటు కంపనీ రూ.14కోట్ల వ్యయంతో మట్టి నుంచి ఇసుకను తయారు చేసే ప్లాంట్​ను ఏర్పాటు చేసింది. ప్రైవేట్​ కంపనీ సప్లై చేసే ఇసుకకు  క్యూబిక్​ మీటర్ లెక్కన సింగరేణి రేటు కట్టి ఇస్తుంది.  ప్లాంట్​లో  రోజు 1,000 క్యూబిక్​ మీటర్ల ఇసుక ఉత్పత్తిచేస్తారు. ఈ ప్లాంట్​ నుంచి శ్రీరాంపూర్​ ఏరియాలోని ఎస్సార్పీ-1, ఎస్సార్పీ- 3, ఆర్కే-7, ఇందారం- 1ఏ అండర్​ గ్రౌండ్​ మైన్లు, మందమర్రి ఏరియాలోని కాసిపేట, కాసీపేట- 2 గనులకు సప్లై చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలవల్ల  ప్లాంట్​ మునిగిపోయింది.  ప్లాంట్​కు సంబంధించిన హేవీ మెషీన్లు, కరంటు మోటార్లు, కన్వేయర్​బెల్ట్​తదితర  సామగ్రి, కంట్రోల్​ రూం పూర్తిగా  నీళ్లలో మునిగిపోయాయి. ప్లాంట్​ నుంచి నీటిని బయటకు తోడేస్తున్నారు.  ప్లాంట్​ మునగడంవల్ల భారీ నష్టం వాటిల్లిందని, నీటిని తోడేసిన  తర్వాత మెషీన్లు పనిచేస్తాయా, లేదా అన్నది తెలుస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. పీఓబీ ప్లాంట్​లోకి వరదనీరు చేరకుండా  సింగరేణి, కాంట్రాక్ట్​ సంస్థ ముందస్తుగా చర్యలు తీసుకోలేదు. ఎత్తుగా ఉన్న ఓసీపీ డంప్​యార్డ్​ల దిగువన ప్లాంట్ నిర్మించారు. దీంతో ఎగువన ఉన్న ఓబీ యార్డుల నుంచి వరదంతా ప్లాంట్​లోకి చేరింది. వరద నీరు వెళ్లేందుకు ప్లాంట్​నుంచి సింగపూర్​ గ్రామం వరకున్న వరద కాల్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల మట్టితో నిండిపోయింది. దీంతో వరదనీరు బయటకు వెళ్లక ప్లాంట్​లోకి చేరింది. 

బాటమ్​ యాష్​ వినియోగిస్తాం
 ఇసుక ప్లాంట్​ నీటిలో మునిగినందున ప్రత్యామ్న యంగా సింగరేణి ఎస్టీపీపీ బాటమ్​ యాష్​ను వినియో గించాలని నిర్ణయించాం.  వారం రోజుల్లో  ప్లాంట్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దిగువ ప్రాంతంలో ఉన్న ప్లాంట్​ను త్వరలో ఎగువన ఉన్న ఓబీ కంపెనీ క్యాంపులోకి మారుస్తాం. - బి.సంజీవరెడ్డి, శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం