అమ్మాయిలూ.. జాగ్రత్త సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయొద్దు: సీపీ సందీప్ శాండిల్య

అమ్మాయిలూ.. జాగ్రత్త సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయొద్దు: సీపీ సందీప్ శాండిల్య
  • అపరిచితులతో చాటింగ్ చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దు
  • ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నరు  
  • వేధింపులకు గురిచేస్తే భయపడకండి..సీపీ మేరా భాయ్ అని చెప్పండి
  • ఇబ్బందులుంటే 8712660001, 9490616555 నంబర్లకు ఫోన్ చేయండి 

హైదరాబాద్, వెలుగు : సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలకు హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య సూచించారు. ఆగంతకులు సోషల్ మీడియాలో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని.. వాళ్ల ఫొటోలు, వీడియోలు సేకరించి, వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. అపరిచితులతో చాటింగ్ చేసి, వాళ్లకు ఫొటోలు షేర్ చేసి.. అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​లో సందీప్ శాండిల్య మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రెండు కేసులను ప్రస్తావిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఇటీవల ఇద్దరు యువతులను దుండగులు బ్లాక్ మెయిల్ చేశారు. ఫేస్ బుక్ లో అమ్మాయిలను ట్రాప్ చేసి.. వాళ్ల ఫొటోలు, వీడియోలు సేకరించారు. ఆ తర్వాత వాటిని మార్ఫింగ్ చేసి, అమ్మాయిలను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేశాం” అని చెప్పారు. ఇలా సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలను ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఎవరినిపడితే వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. ‘‘గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయొద్దు. లైక్స్, కామెంట్లకు వాళ్ల మాయలో పడిపోవద్దు. ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దు. ఫొటోలు షేర్ చేయడం, వీడియో కాల్స్ మాట్లాడటం లాంటివి చేస్తే.. వాటిని దుండగులు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారాలకు పాల్పడుతున్నారు” అని తెలిపారు. ఇలాంటివి బయటకు చెప్పుకోలేక చాలామంది బాధితులు నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

భయపడొద్దు.. మేం ఉన్నం

వేధింపులకు గురవుతున్న మహిళలు ధైర్యంగా ఉండాలని సీపీ సూచించారు. వేధింపుల విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే, బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘‘ఎవరైనా మీ ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తే భయపడొద్దు. ‘హైదరాబాద్ సీపీ.. మేరా భాయ్. దమ్ముంటే మా ముందుకి రారా చూసుకుందాం’ అని సవాల్ చేయండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మాకు చెప్పండి. మీకు మేమున్నాం.. సిటీ పోలీసులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించండి. మీకు ఇబ్బంది ఉంటే మాకు ఫోన్ చేయండి. నా నంబర్ 8712660001, పోలీస్ వాట్సప్ నంబర్ 9490616555. వీటికి సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం” అని తెలిపారు. 

పిల్లలపై పేరెంట్స్ కన్నేసి ఉంచాలె..

పిల్లలపై పేరెంట్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని సీపీ సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు తగిన సమయం కేటాయించకపోవడం, వారు ఏం చేస్తున్నారో గమనించకపోవడమే ఇలాంటివి జరగడానికి ప్రధాన కారణమని చెప్పారు. ‘‘పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరితో ఫ్రెండ్స్ షిప్ చేస్తున్నారు? వారి చదువు ఎలా కొనసాగుతున్నది? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి. కానీ పేరెంట్స్ ఇవేవీ పట్టించుకోవడం లేదు” అని అన్నారు. 

అమ్మాయిలకు పోలీసుల సూచనలివీ..

  • వ్యక్తిగత ఫొటోలను -ప్రొఫైల్ పిక్​గా పెట్టొద్దు. కచ్చితంగా ప్రొఫెల్ లాక్ పెట్టుకోవాలి.
  •  -గుర్తు తెలియని వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపొద్దు. అలాంటి వారి నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తే యాక్సెప్ట్ చేయొద్దు. 
  • ఇతర వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడొద్దు. 
  • వ్యక్తిగత ఫొటోలు, వీడియో చాట్స్​ను షేర్ చేయొద్దు. 
  • లైక్స్, కామెంట్ల కోసం ఆరాటపడొద్దు. లైట్ తీసుకోవాలి.