
హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా నియమితులైన ఎంపీ సింగ్ బాధ్యతలు స్వీకరించాకే సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం పర్యటనకు వెళ్లాలని బోర్డు టీమ్ నిర్ణయానికి వచ్చింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు జూన్ 30నే ప్రాజెక్టు విజిట్‌కు వెళ్లేందుకు హరికేశ్ మీనా నేతృత్వంలోని బోర్డు టీమ్ సిద్ధమైనా, ఏపీ నోడల్ ఆఫీసర్‌ను నియమించలేదు. ఏపీ ప్రభుత్వం సహకరించకుండా ఆ రాష్ట్ర భూభాగంలోని ప్రాజెక్టును తాము సందర్శించలేమని, కేంద్ర బలగాలు రక్షణ కల్పించాలని బోర్డు ఇన్‌చార్జి చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పిస్తే శనివారం (జులై 3న) ప్రాజెక్టును విజిట్ చేస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈలోగా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పెరగడం, ఏపీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాయడంతో కేంద్ర నిర్ణయం కోసం బోర్డు అధికారులు ఎదురుచూస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు కేంద్రం నుంచి రక్షణపై ఏ సమాచారం రాకపోవడంతో టూర్‌ను బోర్డు అధికారులు వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను జూన్ పదో తేదీనే నియమించినా ఆయన ఇంతవరకు చార్జ్ తీసుకోలేదు. ఈనెల 7న ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది. ఆ తర్వాతే సంగమేశ్వరం టూర్‌పై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలిసింది. ఈలోగా నోడల్ ఆఫీసర్ నియామకంపై మరోసారి ఏపీకి లేఖ రాయడంతో పాటు ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకుపోయే ఆలోచనలో బోర్డు అధికారులున్నారు.
9న త్రీమెన్ కమిటీ సమావేశం
తెలంగాణ, ఏపీ మధ్య జలవివాదాలు పెరగడంతో కేఆర్‌ఎంబీ త్రీమెన్ కమిటీ సమావేశానికి బోర్డు సిద్ధమైంది. ఈ ఫ్లడ్ సీజన్‌లో రెండు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదలపై బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్‌పురే ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు చర్చించనున్నారు. ఈనెల 9న త్రీమెన్ కమిటీ సమావేశం ఉంటుందనే సమాచారం కేఆర్‌ఎంబీ నుంచి రెండు రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలిసింది. బోర్డు రిలీజ్ ఆర్డర్ లేకుండానే తెలంగాణ కరెంట్ ఉత్పత్తి ప్రారంభించడం, తాము ఆపాలని కోరినా దాన్ని పట్టించుకోకపోవడంపైనా త్రీమెన్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. మొదట త్రీమెన్ కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి, ఆ తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు.