నకిలీ విత్తనాలు అరికట్టాలి..ఒక్క రైతు నష్టపోవద్దు

నకిలీ విత్తనాలు అరికట్టాలి..ఒక్క రైతు నష్టపోవద్దు

సంగారెడ్డి టౌన్ , మెదక్ టౌన్  వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాలు అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి, మెదక్‌ కలెక్టర్లు శరత్, రాజర్షి షా ఆదేశించారు.  హైదరాబాద్‌ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టరేట్లలో ఎస్పీలు రమణ కుమార్,  రోహిణి ప్రియదర్శిని, అడిషనల్​ కలెక్టర్ రమేశ్‌తో కలిసి వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నకిలీ విత్తనాల  విషయంలో రైతులను చైతన్య పరచాలని, ఒక్క రైతు కూడా నష్టపోవద్దన్నారు.  

జిల్లాలో ఉన్న టాస్క్ ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శాంపిల్స్ చెక్ చేయాలని ఆదేశించారు.  డీలర్లు దుకాణాల్లో తప్పనిసరిగా లైసెన్స్ ప్రదర్శించాలని, రైతులకు పూర్తి వివరాలతో రసీదులు ఇవ్వాలని సూచించారు.  స్టాక్ రిజిస్టర్ నిర్వహణ, ఫారం డీ సమర్పణ, లైసెన్స్ రెన్యువల్ చేయడం, షాపు మార్పు వివరాలు లైసెన్స్ లో నమోదు లాంటి సరి చేసుకోవాలన్నారు.  గ్లైపో సెట్  లాంటి కలుపు మందు, హెచ్‌టీ పత్తి విత్తనాల అమ్మితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీలు మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో పాటు గడువు తేదీ ముగిసినవి అమ్మినా, లైసెన్స్ లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.  పీడీ యాక్ట్ నమోదుకు వెనకాడమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో అగ్రికల్చర్‌‌, హార్టికల్చర్‌‌ అధికారులు, సీడ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.