- వచ్చే సీజన్ నుంచి క్రషింగ్ స్టార్ట్
- మూడు సీజన్ల తర్వాత తెరుచుకోనున్న ఫ్యాక్టరీ
- బకాయిలు చెల్లిస్తూ ట్రయల్ రన్ చేసిన కొత్త మేనేజ్ మెంట్
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కొత్తూరు (బి) శివారులో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోనుంది. మూడు సీజన్ల పాటు మూతబడిన ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేసేందుకు మహారాష్ట్రకు చెందిన సంస్థ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ఇటీవల ఒప్పందం జరిగింది. దీంతో సంగారెడ్డి జిల్లా చెరుకు రైతుల కష్టాలు తీరనున్నాయి.
మూడు సీజన్లుగా క్లోజ్
ఆరు దశాబ్దాల చరిత్ర గల జహీరాబాద్ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో 2023–24, 2024–25, 2025–26 సీజన్ల పాటు చెరుకు క్రషింగ్ జరగలేదు. దీంతో ట్రైడెంట్ పరిధిలోని రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. బిల్లుల చెల్లింపులు, క్రషింగ్ చేపట్టకపోవడం, ఫ్యాక్టరీ ఎత్తేస్తున్నట్టు ప్రకటించడం, ఫ్యాక్టరీ ఆస్తుల వేలానికి ప్రభుత్వ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
ఇలాంటి టైంలో ఫ్యాక్టరీ నడిపించలేమని పాత యాజమాన్యం చేతులెత్తేసింది. క్రషింగ్ టైంలో ఫ్యాక్టరీని మూసేయడంతో కోతకొచ్చిన చెరుకును పొలంలో ఉంచలేక ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రవాణా చార్జీలు భరించే పరిస్థితుల్లో రైతులు నష్టాలు చూడాల్సి వచ్చింది.
ఫ్యాక్టరీని పున ప్రారంభించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. క్రషింగ్ సమస్య వల్ల ఒక దశలో చెరుకు పంట గణనీయంగా తగ్గిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతులకు కొంత ఉపశమనం
కలిగించారు.
ట్రయల్ రన్ షురూ
మూతబడిన ఫ్యాక్టరీని మహారాష్ట్రకు చెందిన ఓ బడా సంస్థ ట్రైడెంట్ బదలాయింపుపై ఇటీవల ఒప్పందం చేసుకుంది. ట్రైడెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మారడంతో 2026-–27 సీజన్ లో క్రషింగ్ మొదలు పెట్టేందుకు చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో మెషినరీ రిపేర్లు చేసి ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు. రైతులకు బకాయిపడిన చెల్లింపులు కొత్త యాజమాన్యం చెల్లిస్తూ వస్తోంది. అలాగే సీడీసీకి చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. లైసెన్స్ మంజూరు, జోన్ అలాట్మెంట్ కోసం ప్రభుత్వం, కేన్ కమిషనర్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు తొలగించుకుని రానున్న చెరుకు సీజన్ లో క్రషింగ్ మొదలు పెట్టేందుకు చర్యలు కొనసాగుతుండడంతో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో పూర్వవైభవం సంతరించుకోనుంది .
జోన్ల కేటాయింపులు ఇలా...
తాజా పరిస్థితులకు అనుగుణంగా ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీకి తరలించే చెరుకు విషయంలో జోన్ల కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ జోన్ కిందకు జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలను చేర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు మండలాలు ఫ్రీ జోన్ పరిధిలో ఉండగా, ఆయా మండలాల్లో 13 వేల టన్నుల చెరుకు పంట సాగవుతోంది. ఎకరాకు సగటున 36 టన్నుల పంట దిగుబడి వస్తోంది.
ఈ లెక్కన రెండు మండలాల్లో 4.70 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి కానుంది. ఇదివరకు ట్రైడెంట్ ఫ్యాక్టరీ జోన్ పరిధిలోని కోహిర్, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్, వట్ పల్లి, రేగోడు మండలాలను రాయికోడ్ మండలం మాటూర్ లో కొత్తగా ప్రారంభించిన గోదావరి గంగ ఆగ్రో షుగర్ ఫ్యాక్టరీకి బదలాయించారు. జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో పండించే 13 వేల టన్నుల చెరుకును కొత్తూరు (బి) ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీకి తరలించే క్రమంలో జోన్ సర్దుబాట్లు జరుగుతున్నాయి. ----------
