సంగారెడ్డి జిల్లాలో డ్వాక్రా మహిళలకు జనరిక్ మెడికల్ షాపులు

సంగారెడ్డి జిల్లాలో డ్వాక్రా మహిళలకు జనరిక్ మెడికల్ షాపులు
  •     మండలానికి ఒకటి చొప్పున ఎంపిక
  •     స్త్రీనిధి కింద రూ.3 లక్షల రుణం
  •     ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

సంగారెడ్డి, వెలుగు:
గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయిస్తోంది. మహిళా సంఘాల సభ్యులకు ఈ అవకాశం దక్కనుంది. అందుకు సంగారెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

డీఆర్డీవో  ద్వారా స్త్రీనిధి రుణాలు మంజూరు చేసి మండలానికి ఒకటి చొప్పున జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 695 గ్రామ సంఘాలు ఉండగా, 25 మండలాల సమైక్య మహిళా సంఘాలున్నాయి. ఇందులో 1.95 లక్షల మంది సభ్యులు ఉన్నారు.  

25 షాపులకు ప్రతిపాదనలు

జనరిక్ మెడికల్ షాప్ నిర్వహణకు అర్హులైన మహిళలను గుర్తించి రుణాలు అందజేయనున్నారు. జిల్లాలో ఉన్న 25 మండలాలకు ఒకటి చొప్పున 25 మెడికల్ షాపుల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముందుగా మండలానికి ఒకటి శాంక్షన్ చేసి ఆ తర్వాత మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు అవసరమైన ఫండ్స్ స్త్రీనిధి ద్వారా ఒక్కో షాప్ నిర్వహణకు రూ.3 లక్షల చొప్పున రుణం అందించి ప్రోత్సహించనున్నారు. 

ఇందుకు సంబంధించి ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. జనరిక్ మందులు ఏర్పాటు చేసుకోవాలనుకునే మహిళలు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులై ఉండాలి. సభ్యత్వం ఉన్న సంఘం తీర్మానం కాపీ, దరఖాస్తు చేసుకునే వారి దగ్గరి బంధువుల్లో ఎవరైనా బీ-ఫార్మసీ, డీ- ఫార్మసీ, ఎం-ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. దుకాణం నిర్వహణకు డ్రగ్ ఇన్​స్పెక్టర్​పర్మిషన్ తీసుకోవాలి. ఈ అర్హతలు ఉన్న దరఖాస్తురాలు స్త్రీనిధి అధికారులకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 

అధికారులు అర్హురాలిగా భావిస్తే ఆ దరఖాస్తును సంబంధిత వెబ్ సైట్ లో నమోదు చేసి రుణమందిస్తారు. లబ్ధిదారులు పొందిన రుణాన్ని ఐదేళ్ల లోపు ప్రతినెలా వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

అగ్గువకే మెడిసిన్

గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కడమే కాకుండా జనాలకు అగ్గువకే మెడిసిన్ లభించనుంది. గ్రామాల్లో పనులు లేక పోషణ భారమవుతున్న క్రమంలో ప్రజలకు మెడికల్ ఖర్చులు భారంగా మారాయి.  

రోగం వచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా ఎక్కువ శాతం మందులు బయట మెడికల్ షాపుల్లో కొనాల్సిందే. మందుల భారం మోస్తున్న గ్రామీణ ప్రజలకు తక్కువ ధరలకు మెడిసిన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళలకు ఈ అవకాశం కల్పించింది. దీంతో ఓ పక్క ఉపాధి మరోపక్క తక్కువ ఖర్చులో మెడిసిన్ దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.