
సిద్దిపేట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఆందోళనలు
సంజయ్ ఆరోగ్యం క్షీణించడంతో ఉద్రిక్తత.. రాత్రి దీక్ష విరమణ
అన్ని ఊర్లు, మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు
ఎక్కడికక్కడ అరెస్టులు.. సీనియర్ నేతల హౌస్ అరెస్ట్
కరీంనగర్‍లో సంజయ్ దీక్షా శిబిరానికి పోటెత్తిన కార్యకర్తలు
గంట గంటకు పడిపోయిన సంజయ్ షుగర్ లెవల్స్
కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించిన డాక్టర్లు
నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన వివేక్, జితేందర్‌రెడ్డి
సిద్దిపేటలో పోలీసుల తీరు, బీజేపీ శ్రేణులపై లాఠీ చార్జ్, పార్టీ రాష్ట్ర చీఫ్బండి సంజయ్ దీక్షతో ఏర్పడిన టెన్షన్ మంగళవారం కూడా కొనసాగింది. బీజేపీ శ్రేణుల ఆందోళనలు, నిరసనలతో రాష్ట్రం హోరెత్తింది. పొద్దున్నుంచే అన్ని జిల్లాల్లో నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కొందరిని పోలీస్స్టేషన్లకు తరలించగా.. ముఖ్య నేతలను ఇండ్లలోనే నిర్బంధించారు. మరోవైపు కరీంనగర్‍లో సంజయ్ దీక్షా శిబిరానికి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. సోమవారం సిద్దిపేటలో జరిగిన ఘటనలతో గాయపడి, తీవ్రంగా అలసిపోయిన సంజయ్.. మంగళవారం పొద్దున్నుంచే నీరసంగా కనిపించారు. ఆయన శరీరంలో గంట గంటకూ షుగర్ లెవల్స్పడిపోతుండటంతో ఆందోళన వ్యక్తమైంది. సాయంత్రం ఆయనను పరీక్షించిన డాక్టర్లు హెల్త్ కండిషన్ విషమంగా ఉందని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కమిటీ సూచనల మేరకు.. సంజయ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. వివేక్ వెంకటస్వామి, జితేందర్‌రెడ్డి సంజయ్‌కి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
కరీంనగర్/ కరీంనగర్ సిటీ, వెలుగు: రాష్ట్ర సర్కారు, సిద్దిపేట పోలీసుల తీరును నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ ఆరోగ్యం మంగళవారం సాయంత్రానికి విషమంగా మారింది. ఉదయం నుంచే ఆయన శరీరంలో షుగర్ లెవల్స్ క్షీణిస్తూ వచ్చాయి. ఇంకాసేపైతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించడంతో దీక్ష విరమింపజేయాలని పార్టీ నిర్ణయించింది. దీంతో రాత్రి ఎనిమిదిన్నర గంటల టైంలో బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని అపోలో రీచ్ హాస్పిటల్‌కు తరలించి.. ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్‌రెడ్డి సంజయ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
రోజంతా ఉద్రిక్తంగా..
బండి సంజయ్ కరీంనగర్‍లో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరం వద్ద మంగళవారం పొద్దంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీ ఆఫీసు వద్దకు వచ్చి.. దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాలు, ఊర్లలో బీజేపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. పార్టీ నేతలు, కార్యకర్తలంతా సంజయ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం కనిపించింది. అసలు సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో దీక్ష చేపట్టిన సంజయ్.. అప్పటికే గాయపడి, తీవ్రంగా అలసిపోయి ఉన్నారు. సిద్దిపేటలో జరిగిన తోపులాట, వాగ్వాదం, పోలీసులు అంగీ, గొంతు పట్టుకుని బలవంతంగా కారులోకి నెట్టేయడంతో తగిలిన దెబ్బలతో ఇబ్బందిపడ్తున్నారు. దీంతో మంగళవారం ఉదయానికే తీవ్ర నీరసంగా కనిపించారు. గంట గంటకు ఆయన శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఆయనను పరిశీలించిన డాక్టర్లు.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని మధ్యాహ్నమే హెచ్చరించారు.
ఆందోళనలో పార్టీ శ్రేణులు
మధ్యాహ్నం ఒంటి గంటకు డాక్టర్లు టెస్టులు చేసినప్పుడు సంజయ్ షుగర్ లెవల్స్ 80కి తగ్గిపోయాయి. మూడు గంటల తర్వాత మరోసారి పరీక్షించగా 70కి పడిపోయాయి. దీంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అప్పటికి ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వారంతా ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సంజయ్ బాడీలో షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని, హెల్త్ కండిషన్ఇబ్బందికరంగా మారుతోందని డాక్టర్లు సమాచారం ఇవ్వడంతో.. సాయంత్రం పోలీసులు దీక్షా శిబిరం దగ్గరికి వచ్చారు. కానీ వారిని చూసి బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగి, సర్కారుకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కారు వెంటనే దిగిరావాలని, సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో పోలీసులు వెనక్కి వెళ్లి పోయారు. తర్వాత టూటౌన్ సీఐ లక్ష్మీబాబు శిబిరం వద్దకు వచ్చి.. సంజయ్హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి వచ్చామని చెప్పడంతో శాంతించారు.
హెల్త్ విషమించడంతో..
జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంవో డాక్టర్ శౌరయ్య టీమ్సాయంత్రం వచ్చి బండి సంజయ్ కు టెస్టులు చేసింది. అప్పటికే షుగర్ లెవల్స్ 59కి పడిపోయినట్టు గుర్తించింది. ఇంకా కాసేపు ఇట్లనే ఉంచితే సంజయ్ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. దీక్షా శిబిరం వద్ద ఎలాంటి హెల్త్ పరికరాలు అందుబాటులో లేవని.. వెంటనే జిల్లా హాస్పిటల్‌కు తరలించాలని డాక్టర్లు స్పష్టం చేశారు. అప్పటికే సంజయ్ స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకోవడంతో వెంటనే సెలైన్ ఎక్కించారు. అయితే బండి సంజయ్ ఆరోగ్యం విషమంగా మారడంతో ఆయనతో దీక్ష విరమింపజేయాలని పార్టీ నిర్ణయించింది. సెలైన్ ఎక్కించాక ఆయన పరిస్థితి కొంత అదుపులోకి రావడంతో.. ప్రైవేటు అంబులెన్స్ లో అపోలో రీచ్ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. మాజీ ఎంపీలు వివేక్ వెంకట స్వామి, జితేందర్ రెడ్డి కలిసి సంజయ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ టైంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. హాస్పిటల్ బయట బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.
కదిలొచ్చిన క్యాడర్
బండి సంజయ్ దీక్షకు దిగడంతో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ కు బయలుదేరారు. కానీ పోలీసులు జిల్లాల్లోనే వారిని అడ్డుకున్నారు. కొందరిని హౌస్ అరెస్టులు చేశారు. అయినా చాలా మంది వచ్చి బండి సంజయ్ ను పరామర్శించారు. సీనియర్ నేతలు డీకే అరుణ, బాబూమోహన్, పెద్దిరెడ్డి తదితరులు ఆయన్ను కలిసి సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం వివేక్ వెంకట స్వామి, జితేందర్ రెడ్డి వచ్చి సంజయ్‌తోనే ఉన్నారు. దీక్ష విరమణ తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. సంజయ్ హెల్త్ క్షీణించడంతో ఆయనను హాస్పిటల్‌కు తరలించామని, నచ్చచెప్పి దీక్ష విరమింప జేశామని వివేక్ చెప్పారు. దుబ్బాక గెలుపులో సంజయ్ అవసరం ఎంతో ఉందన్నారు. టీఆర్ఎస్ పెద్దలు కాళేశ్వరంలో వచ్చిన కమీషన్లను దుబ్బాక ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని.. కేంద్ర బలగాలు, ఐటీ అధికారులను రప్పించి దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు.
For More News..