కరోనా కష్టకాలంలో అండగా ‘సంజీవని సేవాసమితి‘

V6 Velugu Posted on May 17, 2021

కొవిడ్​ కష్టకాలంలో సంజీవని!కొవిడ్​తో చనిపోతే ఫ్యామిలీ ఆమడ దూరంలోనే ఆగిపోతోంది. ఇరుగుపొరుగు వాకిలి దాటట్లేదు. ఎన్ని ఆస్తిపాస్తులున్నా  పాడెకు భుజం పట్టడానికి ఎవరూ ముందుకురావట్లేదు. వైరస్​ భయంతో దూరందూరంగా జరిగిపోతున్నారు అంతా. ఇలాంటి పరిస్థితుల్లో నిస్వార్థంగా  కొవిడ్​ మృతులకి అంత్యక్రియలు చేస్తోంది సంజీవని సేవా సమితి. 

పేదవాళ్ల ఆకలి తీర్చాలి. ఆపదలో ఉన్న వాళ్లని ఆదుకోవాలి. ఈ లక్ష్యంతోనే 2014 లో మొదలైంది సంజీవని సేవా సమితి. కాళేశ్వరంకి చెందిన కీర్తి శ్రవణ్​ కుమార్​ కొంతమంది యువతతో కలిసి ఈ  సంస్థని స్థాపించాడు.  ప్రస్తుతం ఈ సమితి 150మంది సభ్యులతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు అండగా నిలుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి  జిల్లాలోని కాటారం సబ్​ డివిజన్​లోనూ ఈ సంస్థ సేవలందిస్తోంది . కాళేశ్వరంలో 30మంది, కాటారంలో 30మంది, మహాముత్తారంలో 20మంది, మహదేవపూర్​లో 25మంది, సిరొంచా (మహారాష్ర్ట) లో 30మంది, మల్హర్, పలిమెలలో 15మంది సభ్యులు సంజీవని సేవా సమితిలో భాగమై కరోనా బాధితులకు సేవలందిస్తున్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని  కాటారం సబ్​డివిజన్​ పరిధిలోని మహాముత్తారం, కాటారం, మహదేవపూర్, మల్హర్, పలిమెల మండలాల్లో  కరోనా మృతులకి అంత్యక్రియలు చేస్తోంది ఈ  సంస్థ. అంతేకాదు కరోనా పేషెంట్స్​కి ఫ్రీగా ఫుడ్​ డెలివరీ చేస్తోంది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్లకి సరుకులు ఇస్తోంది. మతిస్థిమితం లేని అనాథలకు ఉచితంగా మూడు పూటలా భోజనం పెడుతున్నారు.

మా వంతు సాయం

‘‘ మా వంతు సాయం చేయాలనే తపనతో 2014లో సంజీవని సేవా సమితిని మొదలుపెట్టాం. ఈ ఎనిమిదేళ్లలో కొన్ని వేలమందికి సాయం చేశాం. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. ప్యాండెమిక్​లో చాలామంది తిండి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కరోనా బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తే భోజనం ఏర్పాటు చేస్తున్నాం. కావాల్సిన సామాన్లు, మందులు సమకూర్చుతాం’’ అని సంజీవని సేవా సమితి ఫౌండర్​ కీర్తి శ్రవణ్​ కుమార్​ వాళ్లు చేస్తున్న పనుల గురించి చెప్పాడు.
:: అజ్మీరా డాకునాయక్​, మహాముత్తారం, వెలుగు

 కరోనా మృతులకు అంత్యక్రియలు

వైరస్​ తమకెక్కడ సోకుతుందోనన్న భయంతో కొవిడ్​ మృతుల అంత్యక్రియ లకి కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మేమే దగ్గరుండి అంత్యక్రియలు చేస్తున్నాం. పీపీఈ కిట్లు వేసుకుంటున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా 9391295917 నెంబర్​కి ఫోన్​ చేసి కరోనా మృతుల వివరాలు ఇస్తే... మేమే వాళ్లకి అంత్యక్రియలు నిర్వహిస్తాం. అలాగే  కరోనా బాధితులు ఈ నెంబర్​కి ఫోన్​ చేసి ఇంటి అడ్రస్​ చెప్తే ఫ్రీగా ఫుడ్​ డెలివరీ కూడా చేస్తున్నాం. 
- కొట్టే సతీష్​, ట్రిపుల్​ఎస్​ అధ్యక్షుడు, కాటారం

24 గంటలూ అందుబాటులో..

టైంకి రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.  వాళ్లలో పసిపిల్లలు కూడా ఉన్నారు. రక్తదానంపై సరైన అవగా హన లేకపోవడం వల్లే ఈ చావులు చూడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి బ్లడ్​ క్యాంపెయిన్స్​ కండక్ట్​ చేస్తున్నాం. బ్లడ్​ కావాలంటూ ఎవరు ఫోన్​ చేసినా వెంటనే ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఒక్క విషయంలోనే కాదు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోనే ఉంటాం. 
టి. శ్రీధర్ రావు,- ప్రోగ్రాం ఆర్గనైజర్  
 

Tagged funeral, jayashankar bhupalpally, Sanjeevani Seva Samithi , covid deads

Latest Videos

Subscribe Now

More News