నన్ను వదిలేయండి.. నేను పోతా.. రాజస్థాన్ రాయల్స్‎తో శాంసన్ కటీఫ్..!

నన్ను వదిలేయండి.. నేను పోతా.. రాజస్థాన్ రాయల్స్‎తో శాంసన్ కటీఫ్..!

ముంబై: టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్‌‌ రాయల్స్ నుంచి తప్పుకోనున్నాడా?  తాను ఐపీఎల్‌‌లో ఎంట్రీ ఇచ్చి, కెప్టెన్‌‌గా నడిపిస్తున్న జట్టును వీడాలని డిసైడయ్యాడా? అంటే ఔననే సమాధానం వస్తోంది. శాంసన్, ఫ్రాంచైజీ మధ్య సంబంధాలు సరిగ్గా లేవని, ఈ  కారణంగా శాంసన్  ట్రేడింగ్ ద్వారా  వేరే జట్టులో చేరాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.  మరో జట్టులోకి వెళ్లేందుకు  ట్రేడింగ్‌‌ లేదా వేలంలో పాల్గొనేందుకు తనను రిలీజ్ చేయాలని రాయల్స్ ఫ్రాంచైజీని శాంసన్ అధికారికంగా కోరాడు. 2015లో రాయల్స్ తరఫున ఐపీఎల్‌‌లో ఎంట్రీ ఇచ్చిన సంజు 2016,- 17లో ఫ్రాంచైజీ సస్పెండ్ అయినప్పుడు మాత్రమే వేరే జట్టుకు ఆడాడు. 2021 నుంచి కెప్టెన్‌‌గా రాయల్స్‌‌ను నడిపిస్తున్నాడు. 

2022లో టీమ్‌‌ను ఫైనల్ చేర్చాడు. గత సీజన్‌‌లో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్‌‌‌‌ఆర్ ఈసారి చెత్తగా తొమ్మిదో స్థానంతో తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ క్రమంలో ఫ్రాంచైజీ, శాంసన్ మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియా టీ20 జట్టులో ఓపెనింగ్ చేసే శాంసన్ ఐపీఎల్‌‌లో కూడా అదే స్థానంలో ఆడాలని కోరుకుంటున్నాడు. అయితే, గత సీజన్‌‌లో యశస్వి జైస్వాల్, యంగ్‌‌ సెన్సేషన్‌‌ వైభవ్ సూర్యవంశీతో కూడిన ఓపెనింగ్ జోడీ అద్భుతంగా రాణించడంతో సంజు బ్యాటింగ్ స్థానం మారింది. ఇది కూడా వీరి మధ్య విభేదాలకు ఒక కారణమని భావిస్తున్నారు. ఇక, శాంసన్‌‌కు సన్నిహితంగా ఉండే కొంతమంది ఐపీఎల్, ఇంటర్నేషనల్ ఆటగాళ్లు అతనికి, ఫ్రాంచైజీకి మధ్య గతంలో ఉన్నంత మంచి సంబంధాలు ఇప్పుడు లేవని చెబుతున్నారు.

చెన్నై ఆసక్తి చూపినా..

శాంసన్‌‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు  చెన్నై సూపర్ కింగ్స్ ఇది వరకే ఆసక్తిని చూపించింది. ఎంఎస్ ధోనీ తొందర్లోనే ఐపీఎల్‌‌ నుంచి తప్పుకునే అవకాశం  ఉండటంతో కీపర్‌‌‌‌ కమ్‌‌ కెప్టెన్‌‌ మెటీరియల్‌‌గా సంజు పర్ఫెక్ట్ రీప్లేస్‌‌మెంట్ అని భావించింది. అయితే, సంజుకు బదులుగా రాయల్స్‌‌కు తమ ఆటగాళ్లను ట్రేడ్ చేయడానికి సీఎస్కే ఒప్పుకోలేదు. దాంతో  రెండు ఫ్రాంచైజీల మధ్య  ప్రత్యక్ష ట్రేడింగ్ సాధ్యం కావడం లేదు. శాంసన్ రూ. 18 కోట్లు విలువైన ఆటగాడు కావడంతో, కేవలం డబ్బుకు మాత్రమే అతడిని వదులుకోవడానికి రాజస్తాన్‌‌ యాజమాన్యం కూడా సిద్ధంగా లేదు. 

అయితే, కొన్నాళ్లుగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌‌, శాంసన్ ఇద్దరూ కలిసి చెన్నై ఫ్రాంచైజీ హై పెర్ఫామెన్స్‌‌ సెంటర్‌‌‌‌లో  ట్రైయినింగ్ చేస్తుండటం విశేషం. దాంతో ఇరు ఫ్రాంచైజీల మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు, కొన్ని ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపినా, శాంసన్ స్థాయికి తగ్గ ట్రేడ్ ఆఫర్ ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు, అతని భవిష్యత్తుపై తుది నిర్ణయం రాజస్తాన్‌‌ రాయల్స్ ఫ్రాంచైజీ తీసుకోవాలి. ఏదేమైనా ప్రస్తుతం నెలకొన్న ఈ వివాదం రాజస్తాన్‌‌, శాంసన్ మధ్య సుదీర్ఘ సంబంధాన్ని ముగించే అవకాశం కనిపిస్తోంది.

ఫ్రాంచైజీ నిర్ణయమే ఫైనల్

శాంసన్‌‌ ట్రేడింగ్‌‌ లేదా రిలీజ్ కోసం రిక్వెస్ట్ చేసినా.. దీనిపై తుది నిర్ణయం రాయల్స్ ఫ్రాంచైజీదే కానుంది. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీతో అతని కాంట్రాక్టు 2027 వరకు ఉంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడిని ట్రేడ్ చేయడం, రిలీజ్ చేయడం పూర్తిగా ఫ్రాంచైజీ నిర్ణయమే. అయితే, జట్టులో ఉండాలని కోరుకోని ఒక ఆటగాడిని కొనసాగించడం ఫ్రాంచైజీకి పెద్ద సవాలు కానుంది. అటువంటి ప్లేయర్‌‌ను ఉంచుకోవడం వల్ల డ్రెస్సింగ్ రూంలో గందరగోళం ఏర్పడవచ్చు. అదే సమయంలో తీర్చిదిద్దిన ఓ స్టార్ ప్లేయర్‌‌‌‌ను, పైగా కెప్టెన్‌‌ను కోల్పోవడం కూడా ఆ జట్టకు ఎదురుదెబ్బ కానుంది. ఈ నేపథ్యంలో  రాయల్స్  ఇతర జట్లతో ట్రేడింగ్ అవకాశాల గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.