
శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యాయి. సాయంకాలం 5.30 గంటల నుంచి అంకురారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 18 వరకు బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రతిరోజూ విశేష పూజలు అందుకోనున్నారు. యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహ వాచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశ స్థాపన, వేదపారాయణాలతో పాటు ప్రత్యేక పూజాధికాలు చేయనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్రాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో తెలిపారు.
ఆరు రోజుల పాటు సేవలు
- ఈ నెల 13 నుంచి 18 వ తేదీ వరకు భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 13న భృంగి, 14న రావణ, 15న నంది.16న కైలాస, 18న అశ్వ వాహన సేవలుంటాయి.
- ఈనెల 14న భోగిరోజు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉచిత సామూహిక బోగిపండ్ల కార్యక్రమం.
- 15న మకర సంక్రాంతి రోజున ఆది దంపతుల కల్యాణం
- 15న ఉదయం ఆలయ దక్షిణ మాడవీధిలో మహిళలకు ముగ్గుల పోటీలు
- 17న ఉదయం యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ
- 17న వేద శ్రవణం
- 18న రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.