‘ఎన్నికల’ సంక్రాంతి..! మున్సిపల్‌‌ ఎన్నికలతో జోరుగా ముగ్గులు, ఆటల పోటీలు, హెల్త్ క్యాంప్‌‌లు

‘ఎన్నికల’ సంక్రాంతి..! మున్సిపల్‌‌ ఎన్నికలతో జోరుగా ముగ్గులు, ఆటల పోటీలు, హెల్త్ క్యాంప్‌‌లు
  • మున్సిపల్‌‌ ఎన్నికల నేపథ్యంలో జోరుగా ముగ్గులు, ఆటల పోటీలు, హెల్త్ క్యాంప్‌‌లు
  • పోటాపోటీగా నిర్వహిస్తున్న కౌన్సిలర్, కార్పొరేటర్ ఆశావహులు
  • ప్రజలకు చేరువయ్యేందుకు రకరకాల కార్యక్రమాల నిర్వహణ
  • గెలుపు గుర్రాల కోసం సర్వేలు చేయిస్తున్న ప్రధాన పార్టీల ముఖ్య నేతలు

కరీంనగర్, వెలుగు : మున్సిపల్‌‌ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు సంక్రాంతి పండుగను సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా తమతమ డివిజన్లలో ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు విజేతలకు సొంత డబ్బులతో ప్రైజ్‌‌మనీ ఇస్తున్నారు. వీటితో పాటు కన్సోలేషన్‌‌ బహుమతుల కింద కిచెన్‌‌ అవసరాలకు ఉపయోగపడే వస్తువులు ఇవ్వడంతో పాటు ముగ్గు వేసిన ప్రతి మహిళకు రూ.100, రూ.200 విలువైన ఏదో ఒక గిఫ్ట్‌‌ను అందజేస్తున్నారు. దీంతో పట్టణాల్లోని ఏ వార్డులో చూసినా రంగవల్లుల సందడి నెలకొంది. 

మరికొందరు లీడర్లు స్టూడెంట్లు, యువతకు క్రికెట్, బ్యాడ్మింటన్‌‌తో పాటు ఇతర ఆటల పోటీలు నిర్వహిస్తూ యూత్‌‌ను తమ వైపు  తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. క్రికెట్‌‌తో ఇతర స్పోర్ట్స్ కిట్స్ సైతం అందజేస్తున్నారు. అలాగే ఇంకొందరు నాయకులు తమకు తెలిసిన డాక్టర్లను పిలిపించి వార్డుల్లో హెల్త్ క్యాంప్‌‌లు నిర్వహించడంతో పాటు మందులను ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు. తద్వారా తాము పోటీలో ఉండబోతున్నామంటూ ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తున్నారు.

సర్వేలు చేయిస్తున్న లీడర్లు

రాష్ట్ర వ్యాప్తంగా 123 అర్బన్‌‌ లోకల్‌‌ బాడీల్లో ఎన్నికలకు సర్కారు సిద్ధమైంది. 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల ఫైనల్‌‌ లిస్ట్‌‌ను సైతం ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించింది. దీంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నియోజకవర్గ  ఇన్‌‌చార్జులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గ ఇన్‌‌చార్జి లేదా ఎమ్మెల్యే పరిధిలో ఒకటి, రెండు మున్సిపాలిటీలు మాత్రమే ఉండడంతో వాటిని కైవసం చేసుకోవడం వారికి ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ఆయా డివిజన్లు, వార్డుల్లో ప్రజాదరణ ఉన్న బలమైన అభ్యర్థుల కోసం థర్డ్‌‌ పార్టీ ఏజెన్సీల ద్వారా సర్వే చేయిస్తున్నారు. 

గెలుపు గుర్రాలను గుర్తించి వారికే టికెట్లు ఇప్పించుకోవాలని భావిస్తున్నారు. ఒక్కో డివిజన్‌‌, వార్డులో ప్రయార్టీవారీగా కాంగ్రెస్‌‌ పార్టీ ఐదుగురి పేర్లను సేకరిస్తుండగా.. బీఆర్ఎస్, బీజేపీలు ముగ్గురు, నలుగురు పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రిజర్వేషన్‌‌ ఏది వచ్చినా.. ఆయా కేటగిరీ నుంచి అభ్యర్థి సిద్ధంగా ఉండేలా జాబితాను ప్రిపేర్‌‌ చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్‌‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ఇప్పటికే సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ప్రజల నోళ్లలో తమ పేరు నానేలా ఆశావహుల వ్యూహాలు

అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాన పార్టీలు సర్వే బాట పట్టడంతో ఆశావహుల్లో టెన్షన్‌‌ నెలకొంది. ప్రజలు తమ పేరు చెప్తారో లేదోనన్న అనుమానంతో ఆశావహులు తమ డివిజన్‌‌, వార్డుల్లోని ప్రజల నోళ్ల నుంచి తమ పేరు వచ్చేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు వాడవాడలా న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షల ఫ్లెక్సీలు కట్టించగా.. మరికొందరు తామే పోటీ చేయేబోయే అభ్యర్థులమంటూ.. తమ కాలనీ వాట్సప్‌‌ గ్రూపులు, సోషల్‌‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మరికొందరు ఇప్పటి నుంచే డ్రైనేజీలు క్లీన్ చేయిస్తూ, రోడ్లపై గుంతలు పూడుస్తూ మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. పండుగ నేపథ్యంలో తమ కాలనీల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. వార్డు, డివిజన్లలోని కాలనీ పెద్దలను కలుస్తూ ఈ సారి పోటీలో ఉంటామని, తమ ఆశీర్వాదం కావాలని కోరుతున్నారు.