సంతోష్రావే మొదటి దయ్యం.. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్కా: కవిత

సంతోష్రావే మొదటి దయ్యం.. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్కా: కవిత
  • కేసీఆర్​కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు
  • సీఎం రేవంత్​రెడ్డికి ప్రధాన గూఢచారి
  • కేసీఆర్ తినే​ ఇడ్లీ ఇన్ఫర్మేషన్ ​కూడా చేరవేసే స్పై
  • గద్దర్​ లాంటి వాళ్లను  గంటల కొద్దీ గేటు బయట వెయిట్​ చేయించిండు
  • స్మగ్లర్లకు ప్రభుత్వమంటే భయం లేకుండా పోయిందని వ్యాఖ్య
  • నిమ్స్​లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యకు పరామర్శ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, పార్టీ నేతలకు కేసీఆర్​ దూరమవ్వడానికి కారణం సంతోష్​ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గద్దర్​ లాంటి ఉన్నతమైనవాళ్లు గంటలు గంటలు గేట్​బయట వేచి ఉండడానికి, ఈటల వంటి నేతలు బయటకు వెళ్లిపోవడానికి ఈ సంతోష్​ రావే కారణమని ఫైర్​ అయ్యారు. తాను గతంలో చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం సంతోషేనన్నారు. 

సీఎం రేవంత్​రెడ్డికి ప్రధాన గూఢచారి అని ఆరోపించారు. కేసీఆర్​ ఇడ్లీ తిన్నారా.. సగం ఇడ్లీ తిన్నారా వంటి సమాచారాన్ని కూడా సీఎంకు చేరవేస్తున్నారని ఆరోపించారు. అలాంటి సంతోష్​ను సిట్​ పిలవడం మంచిదేనని, ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం మాత్రం తనకు లేదని పేర్కొన్నారు. ఆ గూఢచారిని సీఎం శిక్షిస్తారని అనుకోవడం లేదన్నారు.


అలాంటి దుర్మార్గుడికి కేటీఆర్, హరీశ్​ రావు ఎందు కు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్​లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్​ కానిస్టేబుల్​ సౌమ్యను మంగళవారం కవిత పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చట్టం తనపని తాను చేసుకుపోతే.. దుర్మార్గుడు సంతోష్​కు శిక్ష పడుతుందన్నారు. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోకుండా పోలీసులు తమ పని తాము చేయాలని కోరారు. ఒక్కోసారి మన నీడ కూడా మన కళ్లను కప్పే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్​కు ఉద్యమకారులను దూరం చేసిన పాపం కచ్చితంగా ఆ దుర్మార్గుడికి తగులుతుందన్నారు. 

స్మగ్లర్లకు భయం లేకుండా పోయింది..

సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్​ కానిస్టేబుల్​ను చంపే ధైర్యం చేశారంటే గంజాయ్​ బ్యాచ్​కు ప్రభుత్వమంటే ఏమాత్రం భయం లేదని అర్థమవుతున్నదన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి ఫ్రీగా మారుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ, గ్రామాల్లోనూ గంజాయి, డ్రగ్స్​ కూడా ఫ్రీగా దొరికే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. స్కూల్ లోకి కూడా గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లలను పాడు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వీటి వల్ల ఆడవాళ్లే బాధితులుగా మారుతున్నారన్నారు. 

గృహహింసకు అవే కారణమవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియాపై వారి ప్రతాపం చూపాలన్నారు. ఎక్సైజ్​, ఫారెస్ట్​ సిబ్బందికి వెపన్స్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. వాళ్లకు ట్రైనింగ్​లో గన్​ఫైరింగ్​పై శిక్షణనిస్తారని.. కానీ, ఇప్పుడు వెపన్స్​ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాబట్టి ఎక్సైజ్, ఫారెస్ట్​ సిబ్బందికి ఆయుధాలిస్తే స్మగ్లర్లకు భయం ఉంటుందన్నారు. డ్రగ్స్, గంజాయి మహమ్మారిని తరిమికొట్టేందుకు జాగృతి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఇవ్వాలన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్​ సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు.