
ఒక చిన్న పట్టణం నల్లగొండ. ఆ చిన్న పట్టణానికి వెళ్లి ఎవరినైనా, ‘ఇక్కడ శాస్త్రీయ నృత్యంలో మంచి ప్రతిభ ఉన్న చిన్నవాళ్లు ఎవరైనా ఉన్నరా?’ అనడిగితే వినిపించే పేర్లలో శాన్వి తప్పకుండా ఉంటుంది. శాన్వి వయసు పన్నెండేళ్లే కానీ, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిలా డ్యాన్స్ చేస్తుంది. శాస్త్రీయ నృత్యంలో తిరుగులేదు ఈ అమ్మాయికి. ఇప్పటికే 120కి పైగా అవార్డులు అందుకుంది. త్వరలో ఒక అంతర్జాతీయ వేదికపై డ్యాన్స్ చేయనుంది. శాన్వి గురించి కొన్ని ముచ్చట్లు..
మలేషియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక వేదికపై నల్లగొండకు చెందిన శాన్వి ప్రదర్శన ఇవ్వనుంది. అది పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్. ఆరేళ్ల వయసునుంచే డ్యాన్స్‌పై ఇష్టం పెంచుకున్న శాన్వి, ఇవ్వాళ ఈ పెద్ద ఈవెంట్‌లో పాల్గొంటోంది. శాన్వి గురించి తెలుసుకోవాలంటే, ఆరేళ్లు వెనక్కి వెళ్లాలి.
చిన్నప్పట్నుంచే…
శాన్వి చాలా చిన్నగా ఉన్నప్పుడే టీవీలో వచ్చే సినిమా పాటలకు, యాడ్స్‌కు, మ్యూజిక్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ ఉండేది. శాన్వి ఇష్టాన్ని గమనించి తల్లిదండ్రులు నామిరెడ్డి శ్రీనివాస్, సుష్మలు అమ్మాయికి ఆరేళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్యం నేర్పించాలనుకున్నారు. శాస్త్రీయ నృత్యకారుడు యాదగిరి మాస్టర్ వాళ్లకు పరిచయమయ్యాడు. అప్పట్నుంచి ఆయన దగ్గర కూచిపూడి నృత్యంలో మెళకువలు నేర్చుకుంటూ వచ్చింది శాన్వి.2012లో గణేశ్ ఉత్సవాలలో మొదటిసారి ప్రదర్శన ఇచ్చిన శాన్వి.. ఆ తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది. పట్టణంలోని సెయింట్ ఆల్ఫొన్సెస్ స్కూల్లో చదువుతున్న శాన్వి, డ్యాన్స్‌తో పాటు చదువులోనూ రాణిస్తోంది. ప్రస్తుతం శాస్త్రీయ నృత్యకారిణి రమణ సిద్ధి దగ్గర శిష్యరికం తీసుకుంటున్న శాన్వి, భవిష్యత్‌లో మరిన్ని పెద్ద ఈవెంట్స్‌లో తన డ్యాన్స్ ప్రదర్శించాలని ఉత్సాహంగా ఉంది.
ఐపీఎస్ అయినా డ్యాన్స్ వదలను
అమ్మ ప్రోత్సాహంతోనే డ్యాన్సర్‌గా ఎదిగిన. బాగా చదివి ఐపీఎస్ అవ్వాలన్నది నా కల. అయితే ఐపీఎస్ అయినా డ్యాన్స్ మాత్రం వదిలిపెట్టను. ప్రపంచస్థాయి నృత్యకారిణి కావాలన్నది నా ఆశయం. ఫ్యూచర్‌లో కూచిపూడి నేర్చుకోవాలని కోరుకునే వాళ్లకు ట్రయినింగ్ కూడా ఇస్తా.
శాన్వి, నృత్యకారిణి, నల్గొండ
శాన్వి అందుకున్న కొన్ని పురస్కారాలు
- 2016 డిసెంబర్26న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన ‘బతుకమ్మ వైభవ నృత్య రూపక ప్రదర్శన’ 22 విభిన్న రూపాలలో గంటా ఇరవై నిమిషాలు ప్రదర్శన ఇచ్చి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
- తెలంగాణ టూరిజం, ఆంధ్రప్రదేశ్ టూరిజం, శ్రీలంక టూరిజం సంయుక్తంగా శ్రీలంక దేశ రాజధాని కొలంబోలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ పోటీ పెట్టారు. ఈ పోటీలో సీనియర్లతో పోటీపడి ప్రత్యేక బహుమతితో సత్కారం పొందింది శాన్వి.
- 2017 నవంబర్14న బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమి సీజన్2 సూపర్ డ్యాన్స్‌లో పాల్గొన్న శాన్వి బెస్ట్ చాంపియన్ అవార్డు అందుకుంది.