- ఉదయం 5.43 గంటలకు పుష్కరకాలం ప్రారంభం
- తొలి పుణ్యస్నానం ఆచరించనున్న కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసిన సర్కార్
భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు : భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రం పుష్కర శోభను సంతరించుకుంది. ప్రాణహిత, గోదావరి నదులతో కలిసి అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదికి ఇయ్యాల్టి నుంచి ‘అంత్య పుష్కరాలు’ ప్రారంభం కానున్నాయి. గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు పుష్కరకాలం ప్రారంభం కానుంది. ఇయ్యాల్టి నుంచి 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
రెండు తెలుగురాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ఆఫీసర్లు.. అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టారు. గతేడాది జరిగిన ఆది పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు వ్యూహాత్మక చర్యలు చేపట్టారు. కాళేశ్వరం వద్ద రూ. 30.63 కోట్లతో కనీస వసతులతో పాటు వివిధ రకాల పనులు పూర్తి చేశారు.
అంత్య పుష్కరాలకు కంచి పీఠాధిపతి, గవర్నర్
గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ స్వామితో పాటు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలి పుణ్యస్నానం ఆచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. వీరితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సైతం హాజరుకానున్నారు. 12 రోజుల పాటు ప్రతిరోజూ ఒక ప్రముఖ పీఠాధిపతి పుష్కర స్నానం ఆచరించనున్నారు.
పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం హోమాలు, సాయంత్రం హారతి, తెప్పోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాల్లో రాత్రి వేళల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. భక్తులకు ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ప్రత్యేక మీడియా సెంటర్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నడక దారిలో మ్యాట్లు, క్యూ లైన్లపై చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎండదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. తాగునీటి కోసం రెండు భారీ ఓహెచ్‌ఆర్‌సీ ట్యాంకులను నిర్మించగా, 500 తాత్కాలిక టాయిలెట్లను సిద్ధంచేశారు. భక్తులు నదిలో స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా 100 మంది గజ ఈతగాళ్లను నియమించారు.
వీరితోపాటు సేఫ్టీ బోట్లు, లైఫ్ రింగ్స్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిరంతరం పర్యవేక్షించనున్నాయి. ఘాట్లు, ఆలయ పరిసరాల్లో నిఘా కోసం 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు సుమారు 1.70 లక్షల వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో 245 ఎకరాల విస్తీర్ణంలో 23 భారీ పార్కింగ్ జోన్లను సిద్ధం చేశారు. ఈ పార్కింగ్ కేంద్రాల నుంచి ఘాట్ల వరకు భక్తులను చేరవేసేందుకు 90 షటిల్ బస్సులు నడుపుతున్నారు. 300 మంది వైద్య సిబ్బందితో 23 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు.
వైభవంగా జరుపుకోవాలి : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు : సరస్వతి అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాళేశ్వరం వద్ద జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ పుష్కర శుభాకాంక్షలు తెలిపారు.
