సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం.. ఈ నెల 21 నుంచి జూన్‌‌‌‌ 1 వరకు నిర్వహణ

సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం.. ఈ నెల 21 నుంచి జూన్‌‌‌‌ 1 వరకు నిర్వహణ
  • 33 టీమ్‌‌‌‌ల ఏర్పాటు, మూడు షిఫ్టుల్లో డ్యూటీలు
  • ఐదు జోన్లు, 18 సెక్టార్లుగా విభజన
  • పారిశుధ్యంపై స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ 

హైదరాబాద్/జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద, గోదావరి తీరాన ‘సరస్వతి అంత్య పుష్కరాల’ నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 21 నుంచి జూన్‌‌‌‌ 1 వరకు జరిగే పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆఫీసర్లను సమన్వయం చేస్తూ 33 ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. 

పుష్కర విధులను మూడు షిఫ్టులుగా విభజించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, మూడో షిఫ్ట్ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు (కంట్రోల్‌‌‌‌రూమ్‌‌‌‌, సీసీ టీవీ వంటి కీలక విభాగాలకు మాత్రమే) పనిచేయనుంది. ప్రతి షిఫ్ట్ అధికారి తన తదుపరి ఆఫీసర్‌‌‌‌కు అన్ని బాధ్యతలు అప్పగించిన తర్వాతే తమ విధుల నుంచి రిలీవ్‌‌‌‌ కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

పరిసరాలు క్లీన్‌‌‌‌గా ఉండేలా..
పుష్కర ఘాట్లు, కాళేశ్వరం ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ రాజ్‌‌‌‌ విభాగం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఆలయ పరిసరాలన్నింటినీ ఐదు జోన్లు, 18 సెక్టార్లుగా విభజించారు. ప్రతి సెక్టార్‌‌‌‌కు ఒక అధికారిని ఇన్‌‌‌‌చార్జిగా నియమించారు. 27 తాత్కాలిక టాయిలెట్‌‌‌‌ బ్లాక్‌‌‌‌లు, 40 తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. 60 మంది పారిశుధ్య కార్మికులు, ట్రాక్టర్లు, స్వీపింగ్ యంత్రాలతో క్లీనింగ్ పనులు నిరంతరం కొనసాగించనున్నారు.
 
నిరంతరం పర్యవేక్షణ
సరస్వతీ అంత్య పుష్కరాల నిర్వహణ కోసం కలెక్టరేట్‌‌‌‌లో ప్రత్యేక వార్‌‌‌‌రూమ్‌‌‌‌ సిద్ధం చేశారు. పుష్కర ఘాట్లు, క్యూ లైన్లు, పార్కింగ్ ఏరియాలను సీసీ కెమెరాల ద్వారా 24 గంటలూ మానిటర్ చేయనున్నారు. అత్యవసర వైద్యం కోసం 10 మెడికల్ క్యాంపులు, 4 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. అన్నదాన కార్యక్రమాలు, ప్రసాద వితరణ కోసం ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. పుష్కర విధుల్లో ఉన్న అధికారులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10.30 గంటలకే హరిత హోటల్‌‌‌‌ వద్ద కలెక్టర్‌‌‌‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. విధులకు హాజరుకాని, నిర్లక్ష్యం ప్రదర్శించే ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ నెల 18న మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులందరితో సమీక్ష నిర్వహించనున్నారు. విధుల్లో ఉండే సిబ్బందికి ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ఐడీ కార్డులు జారీ చేయనున్నారు. గోదావరి నదిలో  భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సురేఖ సూచించారు. మహా పుష్కరాలను భక్తులందరూ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

గజ ఈతగాళ్లు.. ఫ్రీ బస్సులు
నదిలో భక్తుల రక్షణ కోసం 50 మంది గజ ఈతగాళ్లను, లైఫ్‌‌‌‌ గార్డులను సిద్ధం చేశారు. వీరు ఘాట్ల వద్ద నిరంతరం పహారా కాయనున్నారు. మూడు మర బోట్లను సైతం అందుబాటులో ఉంచనున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి భక్తులను ఘాట్ల వద్దకు చేరవేసేందుకు ఉచితంగా ప్రత్యేక షటిల్‌‌‌‌ బస్సులను ఏర్పాటు చేశారు.