మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్​మెంట్​కు శరత్ చంద్రారెడ్డి ఓకే!

మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్​మెంట్​కు శరత్ చంద్రారెడ్డి ఓకే!
  • కోర్టుకు తెలిపిన సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
  •     ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌత్ గ్రూప్ లో ముఖ్య పాత్ర పోషించిన అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ రెడ్డి స్టేట్మెంట్ ను సీఆర్పీసీ సెక్షన్ 164 కింద రికార్డు చేసేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు(ట్రయల్ కోర్టు) అనుమతిచ్చింది. శరత్ చంద్రా రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సీబీఐ శుక్రవారం ట్రయల్ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసింది.

స్టేట్మెంట్లను రికార్డ్ చేయడానికి శరత్ చంద్రా రెడ్డి సమ్మతిస్తారా? అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. అయితే సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలం ఇచ్చేందుకు శరత్ చంద్రా రెడ్డి సిద్ధంగా ఉన్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ సమాధానంతో సంతృప్తి చెందిన కోర్టు.. శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం నమోదు చేసేందుకు పర్మిషన్​ఇచ్చింది. దీంతో త్వరలోనే ఆయన్ను మెజిస్ట్రేట్​ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట కెమెరా ముందు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద సాక్షిగా మాత్రమే శరత్ వాంగ్మూలం రికార్డు చేస్తారు. కాగా, ఈ కేసు ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన సీబీఐకి తెలిపినట్లు సమాచారం. లిక్కర్ పాలసీ, అమలు, సౌత్ గ్రూప్ ఫార్మేషన్, పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చిన తీరుపై వాంగ్మూలంలో చెప్పనున్నట్టు, అలాగే తన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో లిక్కర్ స్కాం కేసులో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ ఉండదని సీబీఐ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఈడీ కేసులో అప్రూవర్​గా శరత్ చంద్రారెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాం తెరపైకి వచ్చిన కొద్ది రోజులకే .. 2022 నవంబర్ 10న శరత్ చంద్రా రెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇలా మనీలాండరింగ్ కేసులో మొత్తం 17 మందిని ఈడీ అరెస్ట్ చేసి స్టేట్మెంట్లు రికార్డు చేసింది. తాజాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది.

అయితే గతేడాది ఏప్రిల్ 25న సీఆర్పీసీ 164 ప్రకారం.. ఈడీ అధికారులు శరత్ చంద్రా రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆయన తన దగ్గర ఉన్న సమాచారం, ఆధారాలను ఈడీ అధికారులకు సమర్పించడమే కాకుండా, తానిచ్చిన స్టేట్మెంట్ లో స్కాంకు సంబంధించిన కీలక అంశాలు వెల్లడించారు. స్టేట్మెంట్ ఇచ్చిన 15 రోజులకు అంటే మే 8న శరత్ చంద్రా రెడ్డికి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే నెల 29న శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో అప్రూవర్ గా మారినట్లు ఈడీ అధికారులు సీఆర్పీసీ 306 అప్లికేషన్ ద్వారా కోర్టుకు తెలిపారు.  శరత్ చంద్రారెడ్డి పేరును సీబీఐ తెరపైకి తేవడంతో ఈ కేసులో కవిత చుట్టు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తున్నది. కవిత పాత్రపై శరత్ చంద్రా రెడ్డి ఇచ్చే వాగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది.