చీరల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సూరత్ బాట.. ఒక్కొక్కరు లక్ష

చీరల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సూరత్ బాట.. ఒక్కొక్కరు లక్ష
  • వచ్చే ఎన్నికల్లో మహిళలకు పంచేందుకు ఏర్పాట్లు
  • ఒక్కొక్కరు లక్ష నుంచి లక్షన్నర చీరలకు సూరత్​లో ఆర్డర్లు
  • ఖర్చు తగ్గుతుందని తయారీ కంపెనీలతో డైరెక్ట్ డీల్
  • 50 మంది ఎమ్మెల్యేలు రూ.150 కోట్లకు పైగా ఖర్చు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు చీరల పంపిణీకి రెడీ అవుతున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున చీరలు తెప్పించేందుకు సూరత్ బాట పడుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యే రెండుమూడు కోట్ల రూపాయలతో లక్ష నుంచి లక్షన్నర చీరలకు ఆర్డర్ ఇచ్చేందుకు ప్లాన్​చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌‌‌‌ ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్​తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఒకరు టీఆర్ఎస్ ​అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. రాష్ట్రమంతా బీఆర్ఎస్ గాలి వీచినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం, ప్రొటోకాల్‌‌‌‌ పరంగా సీఎం కేసీఆర్‌‌‌‌ తర్వాతి స్థానంలో ఉన్న నేతను ఓడించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. సదరు కాంగ్రెస్ అభ్యర్థి అప్పట్లో ఏకంగా రూ.2 కోట్ల విలువజేసే లక్ష చీరలు పంచినట్లు తేలింది. ఇదే ఆయన విజయానికి కారణమైందని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరిగింది. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు రూలింగ్ ​పార్టీ ఎమ్మెల్యేలు ఫాలో అయ్యేందుకు రెడీ అయ్యారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను రూలింగ్​పార్టీ చాలా సీరియస్‌‌గా తీసుకుంటున్నది. వరుసగా రెండు సార్లు గెలవడంతో సహజంగానే ప్రభుత్వంపైనా, ఎమ్మెల్యేలపైనా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీనిని అధిగమించి మూడోసారి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్‌‌ పట్టుదలతో ఉన్నారు. ఈసారి సిట్టింగులకే సీట్లు ఇస్తామని, కానీ ఆయా నియోజకవర్గాల్లో గెలుపు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఒకరకంగా ఎవరి చేతులు వాళ్ల నెత్తిమీదే పెట్టడంతో ఎమ్మెల్యేలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఓవైపు కులసంఘాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కీలకమైన మహిళా ఓటర్లను ఆకట్టుకునే ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్​లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పంచినట్లే తామూ చీరలు పంచాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే వరంగల్‌‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎనిమిది మంది, హైదరాబాద్‌‌ నుంచి 12 మంది, ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాలకు చెందిన ఐదుగురు, నిజామాబాద్‌‌, ఖమ్మం, మహబూబ్‌‌నగర్‌, నల్గొండ జిల్లాల నుంచి ముగ్గురేసి చొప్పున మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు చీరల కోసం సూరత్‌‌లో ఆర్డర్లు ఇచ్చారు. ఒక్కొక్కరు లక్ష నుంచి లక్షన్నర చీరెల కోసం సుమారు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది.

సూరత్​కే ఎందుకంటే.. 

వరంగల్‌‌, హైదరాబాద్‌‌ వంటి లోకల్‌‌ షాపుల నుంచి ఒకేసారి లక్ష, లక్షన్నర చీరలను తెప్పించే పరిస్థితి ఉండదు. ఇక్కడ పెద్ద ఆర్డర్లు ఇస్తే ఎన్నికల కమిషన్‌‌ దృష్టిలో పడుతుందని ఎమ్మెల్యేలు సూరత్‌ ను ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. నిజానికి చీరెల తయారీలో ప్రపంచంలోనే సూరత్‌‌ అతిపెద్ద మార్కెట్‌‌. ఇక్కడ ఉన్న సచిన్‌‌, పాండెస్సర, కఠోదర లాంటి ఇండస్ట్రియల్‌‌ ఏరియాలలో చీరెల తయారీ కంపెనీలు ఉన్నాయి. కేవలం 12 గంటల్లో 200 నుంచి వెయ్యి దాకా చీరలను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్‌‌, చెన్నై, బెంగుళూరు వంటి పెద్ద పెద్ద షాపింగ్‌‌ మాల్స్‌‌కు ఏడాదిలో 10 కోట్ల నుంచి 20 కోట్ల సరుకును హోల్​సేల్​ రేట్లకు సప్లయ్‌‌ చేస్తుంటారు. దీంతో ఈ తరహా హోల్‌‌సేల్‌‌ కంపెనీల దగ్గరికే మన ఎమ్మెల్యేలు క్యూ కడ్తున్నారు. తమ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా చీరెల తయారీకి ఆర్డర్ ఇస్తున్నారు. తమకు నచ్చిన డిజైన్లను ఎంపిక చేసుకొని ఎలక్షన్ నాటికి సప్లయ్‌‌ చేసేలా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. తయారు చేసే కంపెనీకే డైరెక్ట్​గా ఆర్డర్‌‌ ఇస్తే జీఎస్టీ చెల్లింపు కూడా తక్కువే ఉంటుంది. చీరెలు చేతులు మారేకొద్ది రేట్లు పెరుగుతాయి. రవాణా ఖర్చుల భారం పెరుగుతుంది. అలా కాకుండా చీరెల తయారీ కంపెనీల నుంచే నేరుగా లారీల్లో తాము కోరిన చోటుకి సప్లయ్‌‌ చేయడానికి ఆర్డర్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇలా తీసుకొచ్చిన చీరెలను మండలాలు, గ్రామాల వారీగా తమ కార్యకర్తలు, అనుచరుల సాయంతో సులువుగా పంపిణీ చేయవచ్చని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.