IND vs ENG 5th Test: బెయిర్ స్టో, గిల్ మధ్య గొడవ.. సర్ఫరాజ్ కౌంటర్ అదుర్స్

IND vs ENG 5th Test: బెయిర్ స్టో, గిల్ మధ్య గొడవ.. సర్ఫరాజ్ కౌంటర్ అదుర్స్

భారత్, ఇంగ్లాండ్ ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన టెస్టులో ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో, టీమిండియా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. 36 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో ఉన్నప్పుడు బెయిర్ స్టో, రూట్ ఇంగ్లాండ్ ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బెయిర్ స్టో ఎదురు దాడికి దిగుతూ బౌండరీల వర్షం కురిపించాడు. అయితే ఇన్నింగ్స్ 18 ఓవర్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. 

స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ తో బెయిర్ స్టో నువ్వు ఆండర్సన్ ను ఎందుకు స్లెడ్జింగ్ చేసావు. అతను నీ వికెట్ తీసాడుగా అని అన్నాడు.  అతను నా సెంచరీ తర్వాత వికెట్ తీశాడు. నువ్వు ఇక్కడ ఎన్ని సెంచరీలు కొట్టావు అని వెంటనే గిల్ బదులిచ్చాడు. నువ్వు ఇంగ్లాండ్ లో ఎన్ని సెంచరీలు చేశావు అని బెయిర్ స్టో కౌంటర్ విసిరాడు. వీరి మధ్య జరిగిన ఘర్షణలో సర్ఫరాజ్ జోక్యం చేసుకొని బెయిర్ స్టోకు దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. ఈ సిరీస్ లో మీరు చేసిన కొన్ని పరుగులకు ఇలా ప్రవర్తించడం అవసరమా అని అన్నాడు. 

నిజానికి 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో బెయిర్ స్టో దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన 10 ఇన్నింగ్స్ ల్లో ఒక్కసారి హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోలేకపోయాడు. మరోవైపు గిల్ 2 సెంచరీలతో 400 కు పైగా పరుగులు చేస్తే.. సర్ఫరాజ్ 5 ఇన్నింగ్స్ ల్లో 3హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ఘర్షణ జరిగిన తర్వాత ఓవర్లోనే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో బెయిర్ స్టో ఔటయ్యాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.   ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి సిరీస్ ను 4-1 తేడాతో గెలుచుకుంది.