విజయ్ హజారే ట్రోఫీ: సర్ఫరాజ్ సెంచరీ.. గోవాపై ముంబై ఘన విజయం

విజయ్ హజారే ట్రోఫీ: సర్ఫరాజ్ సెంచరీ.. గోవాపై ముంబై ఘన విజయం

జైపూర్: టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్  (75 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో  157) విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో  చెలరేగాడు. బుధవారం గోవాతో జరిగిన గ్రూప్‌‌‌‌–సి మ్యాచ్‌‌‌‌లో అతను ఫోర్లు, సిక్సర్ల మోత మోగించడంతో ముంబై  87 రన్స్ తేడాతో భారీ విజయం అందుకొని నాకౌట్ దశకు మరింత చేరువైంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 444 /8  స్కోరు సాధించింది.సర్ఫరాజ్ తన ఇన్నింగ్స్‌‌‌‌లో ఏకంగా 14 సిక్సర్లు బాదాడు. 56 బంతుల్లోనే అతను వంద అందుకున్నాడు. ముషీర్ ఖాన్ (60), హార్దిక్ తమోర్ (53), యశస్వి జైస్వాల్ (46) కూడా రాణించారు. ఛేజింగ్‌‌‌‌లో గోవా ఓవర్లన్నీ ఆడి 357/9 స్కోరు చేసి ఓడింది. అభినవ్ తేజ్రానా (100) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు.

హైదరాబాద్‌‌‌‌కు నాలుగో ఓటమి

ఈ మెగా టోర్నీలో హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమి ఖాతాలో వేసుకుంది.  గ్రూప్‌‌‌‌–బిలో భాగంగా జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌‌‌‌లో 37 రన్స్ తేడాతో బరోడా చేతిలో ఓడిపోయింది. అమిత్ పాసి (127), నిత్య పాండ్యా (122), క్రునాల్ పాండ్యా (109) ముగ్గురూ సెంచరీలతో విరుచుకుపడటంతో తొలుత బరోడా 50 ఓవర్లలో 417/4 భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో హైదరాబాద్ ఓపెనర్లు అభిరత్ రెడ్డి (130), ప్రజ్ఞయ్ రెడ్డి (113) సెంచరీలతో పోరాడినా మధ్యలో వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ 49.5 ఓవర్లలో 380 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. వరుసగా నాలుగో ఓటమితో హైదరాబాద్ నాకౌట్ అవకాశాలు 
సన్నగిల్లాయి.