హైదరాబాద్, వెలుగు: సారిడాన్ మాత్రలకు సుప్రీం కోర్టు ఉపశమనం కల్పించింది. పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (పీఈఎల్) కు చెందిన సారిడాన్ బ్రాండ్ మాత్రలను మళ్లీ మార్కెట్లో అమ్ముకునేందుకు అనుమతించింది. కిందటేడాది బ్యాన్ చేసిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్ డీసీ) జాబితా నుండి సారిడాన్‌ను మినహాయిస్తున్నట్లు సుప్రీం కోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 328 ఎఫ్ డీసీ లను బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భద్రతా ప్రమాణాలను ఉటంకిస్తూ ఈ ఎఫ్ డీసీలను కేంద్రం నిషేధించింది. వాటి వినియోగానికి సమంజసమైన కారణాలు లేవని ప్రస్తావించింది. ఐతే, గత 50 యేళ్లుగా ఎంతో నమ్మకమైన బ్రాండ్ గా గుర్తిం పు పొందిన సారిడాన్ కు, కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో సంతోషంగా ఉందని పీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందిని పిరమల్ తెలిపారు.
తమ ఉత్పత్తుల్లో సారిడాన్ ప్రత్యేకమైన బ్రాండ్ అని, దీన్లో మరిం త పెట్టుబడులు పెట్టి, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతామని నందిని వెల్లడించారు. సారిడాన్ బ్రాండ్ రూ.100 కోట్ల విలువైందని, తమ ఓటీసీ (ఓవర్ ది కౌంటర్) రెవెన్యూలో మూడింతల రెవెన్యూ సారిడాన్ నుండే వస్తోందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న 9 లక్షల రిటెయిల్ ఔట్‌లెట్స్ ద్వారా సెకనుకు 31 సారిడాన్ టాబ్లెట్లు అమ్ముడవుతున్నాయని చెప్పారు.
