ఆర్టీసీ సమ్మెపై సర్కార్​ అడుగులెటు?

ఆర్టీసీ సమ్మెపై సర్కార్​ అడుగులెటు?

కార్మికులను చర్చలకు పిలుస్తుందా?
ఎండీని నియమిస్తుందా? మంత్రులతో కమిటీని వేస్తుందా?
 కోర్టు కామెంట్స్ తర్వాత ప్రభుత్వం చర్యలపై అందరి దృష్టి
నేడు హుజూర్​నగర్​ సభలో సీఎం ప్రసంగంపై ఆసక్తి

బేషరతు చర్చలకు సిద్ధం

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వం చర్చలకు పిలిస్తే బేషరతుగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఎటువంటి షరతులు విధించకుండా చర్చలకు పిలవాలి.  ముందు చర్చలు జరిపితే  ఏ డిమాండ్లను పరిష్కరించవచ్చో, ఏ డిమాండ్ల ను అధ్యయనం  చేయవచ్చో ఓ నిర్ణయానికి రావచ్చు.   ఎలాంటి చర్చలు లేకుండా సమ్మె విరమించేందుకు కార్మికులు సిద్ధంగా లేరు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎవరిని నియమించినా మేము వెళ్లి మాట్లాడేందుకు రెడీ.                                                                                              – అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ జేఏసీ చైర్మన్​

ఏం చేయాలన్నా ముందుగా ఎండీని పెట్టాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలన్నా ముందుగా ఆర్టీసీకి రెగ్యులర్ ఎండీని నియమించాల్సి ఉంది. దీనిపై కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకు ఎండీ లేకపోవడం వల్లే కార్మికుల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సమ్మెకు దారితీసిందని కార్మిక నేతలు  చెబుతున్నారు. ఎండీ వస్తే కార్మిక సంఘాలతో నేరుగా చర్చలు జరిపి, ఆ తర్వాత ప్రభుత్వంతోను మాట్లాడి డిమాండ్ల పరిష్కారం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. లేదా ప్రభుత్వమే మంత్రులు, అధికారులతో కమిటీ వేసి కార్మిక సంఘాలను చర్చలకు పిలవచ్చు. ఇంతకుముందు ఐఏఎస్​ల కమిటీతో చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు కొన్ని అధికారాలున్న కమిటీ వేస్తేగానీ సరైన దిశగా చర్చలు జరిగే అవకాశం లేదు.

విలీనం మాటేలేదు!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో ప్రభుత్వం వైఖరి మారే అవకాశం లేదని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే సమ్మె ఆగితే, ఈ అంశం సాధ్యాసాధ్యాలపై  అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులతో కమిటీ వేసే అవకాశం ఉందని అన్నారు. ఆ కమిటీ వివిధ రాష్ట్రాల్లో  ప్రభుత్వ ఆధీనంలో ఉన్న  రవాణా సంస్థల పనితీరును పరిశీలించి రిపోర్టు ఇస్తుందని చెప్పారు.

కదలిక లేని సర్కారు

అయితే  చర్చల విషయంలో   ప్రభుత్వంలో ఎలాంటి కదలికలు కనబడటంలేదని ఓ సీనియర్ అధికారి అన్నారు. బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ పలువురు అధికారులతో భేటీ కావడంతో సమ్మె విషయంపైనే చర్చిస్తున్నారనీ, రాత్రికి ఏదైనా ప్రకటన వస్తుందని భావించారు. అయితే అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. కోర్టు ఆదేశాల  మేరకు ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించేందుకు మాత్రం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్,అకున్ సబర్వాల్, స్టీఫెన్ రవీంద్ర పేర్లు పరిశీలనలోఉన్నాయి. కొత్త ఎండీ రాగానే చర్చలు జరిగే అవకాశం ఉందనీ, దీంతో కోర్టు చెప్పినట్లుగా చర్చలు మొదలైనట్టేనని ప్రగతిభవన్ కు దగ్గరగా ఉండే ఓలీడర్ చెప్పారు. ప్రభుత్వం ముందు చర్చలకు పిలిచి డిమాండ్ల పరిష్కారం కోసం కమిటీ వేస్తే సమ్మె విరమించేందుకు మెజారిటీ కార్మికులు సిద్దంగా ఉన్నారు. 26 డిమాండ్లలో కొన్నింటిని వెంటనే పరిష్కరించే అవకాశం ఉందనీ, వాటిలో వెంటనే పరిష్కరించే వాటిని ప్రభుత్వం చెబితే చాలని  ఓ కార్మిక సంఘం నాయకుడు చెప్పారు. సంస్థ విలీనంపై అధ్యయనం కోసం కమిటీ వేసి నిర్ణయం తీసుకోవడం మంచిదని అన్నారు.  మరోవైపు హుజూర్​నగర్​ ఉప ఎన్నికల ప్రచారానికి గురువారం వస్తున్న ముఖ్యమంత్రి అక్కడి సభలో సమ్మెపై ఏమైనా చెబుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.