ఇంటర్​లో ఆన్​లైన్ వాల్యుయేషన్​పై సర్కార్ అత్యుత్సాహం

ఇంటర్​లో ఆన్​లైన్ వాల్యుయేషన్​పై సర్కార్ అత్యుత్సాహం
  • రాష్ట్రంలోని సగం మంది స్టూడెంట్స్​కు ఒకేసారి అమలు
  • లాంగ్వేజీలతో పాటు ఆర్ట్స్ స్టూడెంట్లందరికీ ఇంప్లిమెంట్​ చేయాలని నిర్ణయం 
  • టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన ఇంటర్ బోర్డు 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఆన్​లైన్ వాల్యుయేషన్​పై సర్కార్ అత్యుత్సాహం చూపుతోంది. ఇంటర్ ఎడ్యుకేషన్​లో ఎవరికీ పెద్దగా అవగాహన లేకున్నా, ఒకేసారి రాష్ట్రంలోని సగం మంది స్టూడెంట్లకు అమ లు చేసేందుకు రెడీ అయింది. దీనికి అనుగుణంగా టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది కేవ లం రెండు, మూడు మైనర్ సబ్జెక్టులతో పాటు లాంగ్వేజీల్లో అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదట ప్రకటించగా.. ఇప్పుడేమో లాంగ్వేజీలతో పాటు ఆర్ట్స్ గ్రూప్ స్టూడెంట్లు అందరికీ అమలు చేయాలని నిర్ణయించారు. పోయినేడాదే బోర్డు అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ, అప్పటి సీఎస్​సోమేశ్ ​కుమార్ పక్కనపెట్టారు. ఇంటర్ బోర్డు ఇన్​చార్జ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఈ ఏడాది​ మరోసారి ప్రతిపాదనలు పంపారు. నవంబర్​లో జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. పైలట్ ప్రాజెక్టు కింద రెండు, మూడు సబ్జెక్టుల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని మంత్రి సబితారెడ్డి మీడియాతో చెప్పారు. కానీ లాంగ్వేజీలతో పాటు ఆర్ట్స్ గ్రూప్ స్టూడెంట్లు అందరికీ అమలు చేయాలని తాజాగా నిర్ణయించారు. దీనికి అనుగుణంగా బుధవా రం టెండర్లు కూడా పిలిచారు. 2022–23, 2023–24, 2024–25 అకడమిక్​ ఇయర్లల్లో పబ్లిక్ ఎగ్జామ్స్​ తో పాటు అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆన్​లైన్ వాల్యువేషన్​కు టెండర్లను ఖరారు చేయనున్నారు. గురువారం నుంచి టెండర్లు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. 

లెక్చరర్లలో అయోమయం..

ఇంటర్ స్టూడెంట్లకు ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 9.5 లక్షల మంది ఇంట ర్ స్టూడెంట్లు ఉంటే, వారిలో 5 లక్షల మందికిపైగా సైన్స్ స్టూడెంట్లు. సైన్స్​ స్టూడెంట్లకు ప్రధాన సబ్జెక్టులు మినహా మిగిలిన లాంగ్వేజీ సబ్జెక్టులకు ఆన్ లైన్ వాల్యుయేషన్ చేయాల్సి ఉంది. దీంతో లెక్చరర్లలో అయోమయం నెలకొంది. ఆన్​లైన్ వాల్యుయేషన్​పై వారికి ట్రైనింగ్ ఇవ్వలేదు. దీంతో సాధ్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.