రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు సర్కార్ ససేమిరా

రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు సర్కార్ ససేమిరా
  • దవాఖాన్లలో టెంపరరీ పోస్టులే
  • రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు సర్కార్ ససేమిరా
  • కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పేరుతో శ్రమ దోపిడీ
  • కరోనా టైమ్ లో పనిచేసిన 1,640 నర్సుల తొలగింపు
  • ఇప్పుడు తాత్కాలికంగా డాక్టర్ల కోసం మళ్లీ నోటిఫికేషన్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో డాక్టర్లు, నర్సులను ప్రభుత్వం తమ అవసరానికి వాడుకుని వదిలేస్తోంది. ప్రభుత్వ దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో వేలల్లో ఖాళీ పోస్టులు ఉన్నా రెగ్యులర్‌‌‌‌ బేసిస్‌‌పై రిక్రూట్‌‌ చేయట్లేదు. డెంగీ, కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు నర్సులు, డాక్టర్లకు టెంపరరీగా ఉద్యోగాలిచ్చి అవసరం తీరాక వాళ్లను రోడ్డున పడేస్తోంది. కరోనా ఫస్ట్‌‌, సెకండ్ వేవ్‌‌లో ప్రాణాలకు తెగించి పనిచేసిన 1,640 మంది నర్సులను ఇటీవల ఉద్యోగాల్లోంచి తీసేయగా ఇప్పుడు తమ అవసరానికి వాడుకునేందుకు డాక్టర్లు కావాలంటూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మెడికల్ కాలేజీల్లో పనిచేసేందుకు 180 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్య విధాన పరిషత్‌‌లోని దవాఖాన్లలో పనిచేసేందుకు 140 మంది స్పెషలిస్టులు, ఏడుగురు మెడికల్ ఆఫీసర్లు కావాలని నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి వరకు లేదా తమకు అవసరం ఉన్నంత వరకే ఉద్యోగాలు ఉంటాయని, తర్వాత తొలగిస్తామని నోటిఫికేషన్‌‌లో పేర్కొంది. ఇలా ఆర్నెళ్ల కోసం, ఏడాది కోసం పనిచేయడానికి తామేమీ అడ్డా మీద కూలీలం కాదని డాక్టర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కాంట్రాక్ట్ నోటిఫికేషన్లు ఇచ్చినా చేరేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు. ఇప్పుడు మరోసారి వాక్ ఇన్‌‌ ఇంటర్యూలతోనే ఉద్యోగాలిస్తామని నోటిఫికేషన్ ఇచ్చారు.

బోర్డు ఎందుకు ఇగ?

రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయడానికి టైమ్ పడుతుందని.. అందుకే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నామని ప్రభుత్వం సాకులు చెబుతోంది. కానీ హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌లో రిక్రూట్‌‌మెంట్‌‌లు వేగంగా చేసేందుకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు ఉంది. మూడేండ్ల కిందటే దీన్ని ఏర్పాటు చేసినా రిక్రూట్‌‌మెంట్లు చేసేందుకు బోర్డుకు అవకాశం ఇవ్వలేదు. అలాంటప్పుడు బోర్డు పెట్టి ఏం ఉపయోగమని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. బోర్డు ద్వారా రెగ్యులర్‌‌‌‌ బేసిస్‌‌పై రిక్రూట్‌‌మెంట్ చేసే అవకాశం ఉన్నా టెంపరరీ నియామకాలకే సర్కార్ మొగ్గు చూపిస్తోంది.

పది వేలకుపైగా ఖాళీలు

హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో 10 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 3,500 డాక్టర్ పోస్టులు, 6 వేలకుపైగా నర్సుల అవసరం ఉంది. ఇటీవలే కొత్తగా మరో 7 వేల పోస్టుల వరకు మంజూరయ్యాయి. కానీ పోస్టుల భర్తీకి సర్కారు ఇష్టపడట్లేదు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌‌ సోర్సింగ్ వ్యవస్థ ఉండదన్న కేసీఆర్‌‌‌‌.. హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌లో మాత్రం పూర్తిగా కాంట్రాక్ట్‌‌, ఔట్ సోర్సింగ్ నియామకాలపైనే ఆధారపడుతున్నారు. అటెండర్ల దగ్గర్నుంచి, డాక్టర్ల వరకూ అన్ని వ్యవస్థలను టెంపరరీ చేసేస్తున్నారు.

కాంట్రాక్టు జాబులే ఉండవన్న సీఎం

పది రోజులో, నెల రోజులో అయితే టెంపరరీగా తీసుకుంటే తప్పులేదు. సంవత్సరాలు తరబడి చేసే ఉద్యోగాలకు కూడా గత పాలకులు టెంపరరీగా తీసుకున్నరు. కాంట్రాక్ట్‌‌‌‌ డాక్టర్, కాంట్రాక్ట్‌‌ నర్సు, కాంట్రాక్ట్ ఏఎన్‌‌ఎం, సెకండ్ ఏఎన్‌‌ఎం.. ఏంటేంటో వాళ్ల మొహాల పేర్లు పెట్టిన్రు. ఔట్‌‌సోర్స్‌‌, ఇన్‌‌సోర్స్‌‌, మన్ను సోర్స్‌‌, మశానం సోర్స్‌‌ అని పెట్టిన్రు. మేము కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నం. ఇక ఈ కాంట్రాక్ట్, ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగాలు బంద్ పెడ్తున్నం.

- అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌‌‌‌( 2017 మార్చి)