హైదరాబాద్: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహాలం నెలకొంది. 2025, డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాయికోడ్ మండలం శంషోదిన్పూర్ గ్రామ శివారులో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి రాజు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పిప్పాడ్ పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.
ఏమైందో తెలియదు కానీ పోలింగ్ తేదీ సమీపిస్తోన్న వేళ గ్రామ శివారులో ఉన్న ఓ ఫామ్ హౌస్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రాజు ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజు ఆత్మహత్యకు పొలిటికల్ ప్రెజరా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడటం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
